తడిగిరి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంపై గ్రామసభలో తీర్మానం
జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీ పూజ.
స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్, మార్చి 28: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హుకుంపేట మండలం తడిగిరి గ్రామాన్ని మత్తు రహిత, పర్యావరణ హిత ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలని జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమని శ్రీపూజ పేర్కొన్నారు. శనివారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.స్వర్ణ గ్రామ, స్వర్ణ అవార్డు జిల్లా నోడల్ అధికారి డీఎల్‌పీఓ పి.ఎస్. కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామాభివృద్ధి క్షేత్రస్థాయి నుంచే ప్రారంభం కావాలని ఆమె స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గ్రామాన్ని “మత్తు రహిత గ్రామం”గా ప్రకటించే దిశగా గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహెత్ ప్రతిజ్ఞ చేయించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు. అలాగే విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్‌సీసీ ఇళ్లపై సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయాలని కోరారు.హుకుంపేట గిరిజన బాలికల ఇంగ్లీష్ మీడియం పాఠశాలను సందర్శించిన ఆమె, చెత్త నిర్వహణ పద్ధతులను పరిశీలించారు. తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చి వినియోగించుకోవాలని, పొడి చెత్తను ‘స్వచ్ఛ రథం’ ద్వారా విక్రయించాలని, ప్రమాదకర చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి పారవేయాలని సూచించారు. పాఠశాలలు, గ్రామాలు “జీరో వేస్ట్” లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా సన్మానించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గ్రామ అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహెత్, డీఎల్‌పీఓ పి.ఎస్. కుమార్, గ్రామ సర్పంచ్ రంజిత్, ఎంపీటీసీ భీమలింగేశ్వరరావు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.