PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 2:02 pm Posted By : PEN POWER MEDIA

మదనపల్లి ఫైల్స్ లో పెద్దిరెడ్డి చుట్టూ రాజకీయం

 

  • మదనపల్లి ఫైల్స్ కేసులో కీలక అరెస్టులు

  • పెద్దిరెడ్డి అనుచరులపై పోలీసులు కఠిన చర్యలు

  • సుప్రీంకోర్టులో బెయిల్ తిరస్కరణతో మలుపు

  • ఆర్డీవో కార్యాలయ అగ్నిప్రమాదంపై అనుమానాలు

  • ప్రమాదం కాదా? ఉద్దేశపూర్వక ఘటనపై దర్యాప్తు

  • సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు

  • సీబీసీఐడీ దర్యాప్తుతో కేసుకు వేగం

  • అమెరికా నుంచి వచ్చిన నిందితుడి అరెస్ట్

  • రెవెన్యూ అవకతవకలపై వెలుగులోకి వస్తున్న విషయాలు

  • పెద్దిరెడ్డి పాత్రపై దర్యాప్తు ముమ్మరం

 

మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అరెస్ట్ కావడంతో, ఈ కేసు రాజకీయంగా మరింత హీట్ ఎక్కింది. దర్యాప్తు వేగం పెరగడంతో పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది.

తిరుపతి, పెన్ పవర్ మార్చి20: 

 

ఏపీలో మరో కొత్త కేసు తెరపైకి వచ్చింది. మదనపల్లె ఫైల్స్ దహనం కేసులో బుధవారం కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముని తుకారాం, మాధవ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ముని తుకారాం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ గా వ్యవహరించారు. మాధవరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధానానుచరుడు. వీరిద్దరూ మదనపల్లె ఫైల్స్ కేసులో a3, ఏ4 నిందితులుగా ఉన్నారు. వీరిద్దరూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే వీరి అరెస్టు జరిగింది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ సంబంధమైన కేసులను తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలో 2024 జూలై 21న మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. రెవెన్యూ ఫైల్స్ కాలిపోయాయి. అందుకే ఇది ప్రమాదం కాదని.. ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన అని అనుమానిస్తూ పలు అభియోగాలు నమోదయ్యాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఘటనకు కారణమన్న అనుమానాలు బలపడ్డాయి.. ఈ నేపథ్యంలో ఘటన జరిగిన సమయంలో మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, హరిప్రసాద్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్డీవోగా గతంలో పనిచేసిన మురళి అనే అధికారిపై కూడా చర్యలు తీసుకున్నారు.వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అవకతవకలు బయటపడకుండా ఉండేందుకుగాను ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం 2024 ఆగస్టులో మదనపల్లి ఫైల్స్ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. అందులో భాగంగా సిఐడి అధికారులు గౌతమ్ తేజ్ తో పాటు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, మురళిలను అరెస్టు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో మాధవరెడ్డికి కోర్టు రిమాండ్ విధించలేదు. దీంతో ఆయన బయటే ఉన్నారు. మరోవైపు ఏ 4 నిందితుడిగా ఉన్న ముని తుకారాం గత ఏడాది జూలైలో అమెరికా వెళ్ళిపోయారు. బుధవారం వీరిద్దరినీ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర పై దర్యాప్తు ముమ్మరంగా సాగే ఛాన్స్ కనిపిస్తోంది. పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు అర్థమవుతుంది.