మరిడమ్మ జాతరకు చురుగ్గా ఏర్పాట్లు
-అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అయ్యన్న కుటుంబం
-ఊరంతా విద్యుద్దీపాలంకణ
-లక్షకు పైగా జనం జాతరలో పాల్గొంటారని అంచనా
నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 28) :
నర్సీపట్నం ప్రజల ఆరాధ్య దైవం మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షకు పైగా భక్తులు జాతరలో పాల్గొంటారనే అంచనాతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఊరంతా విద్యుద్దీపాలంకరణలు, పెద్దపెద్ద గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నర్సీపట్నం ప్రజలకు ఇదొక సొంత పండుగని, యువత ఈ సంబరాల్లో చురుకుగా పాల్గొనడం సంతోషకరమని అన్నారు. జాతరలో భారీ క్రాకర్స్ షోతో పాటు గోపురానికి కూల్ ఫైర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవాలని, భద్రతా విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు క్యూలైన్లలో ఇబ్బంది పడకుండా సహాయకులను వెంట తెచ్చుకోవాలని, భక్తుల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ సౌకర్యాలు అందుబాటులో ఉంచామని తెలిపారు.