PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 12:19 pm Posted By : PEN POWER MEDIA

మహిళల భద్రత..! నినాదాలకే పరిమితమా..?

సహ చట్టంలో ‘ఐసీసీ’ పట్ల వీస్తూపోయే సంచలన నిజాలు వెలుగులోకి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధుబాబు చికిలే వ్యాసం..

పని ప్రదేశాల్లో ‘ఐసీసీ’ బలోపేతంపై లేవనెత్తిన ప్రశ్నలు..!
మహిళల పని ప్రదేశాల్లో భద్రత ఎక్కడ..? ఐసీసీ లేని సంస్థల్లో ఆందోళన..
మహిళా దినోత్సవం సందేశమే: ప్రతి కార్యాలయంలో ‘ఐసీసీ’ తప్పనిసరి..!పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతపై మళ్లీ చర్చకు దారితీస్తున్న వైనం..

ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ(ఐసీసీ) ఏర్పాటు ప్రతి సంస్థలో తప్పనిసరి ఉండాలి..!

నేటికీ అనేక సంస్థల్లో కమిటీలే లేవని సహ చట్టంతో నిజాలు బట్టబయలు..

చిన్న సంస్థల్లో తక్షణమే అమలు ఆవశ్యకత అత్యవసరం..

“హక్కులు- న్యాయం- చర్యలు: మహిళల భద్రతకు ఐసీసీ బలోపేతమే మార్గం..

చట్టం ఉంది..! కమిటీలు ఎక్కడ..? పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై ప్రశ్నలు..

మహిళల గౌరవానికి రక్షణ కవచంగా ఐసీసీ.. కమిటీలు ఎందుకు లేవు..?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళల భద్రత.. నినాదాలకే పరిమితమా..? అన్న ప్రశ్నలకు తావిస్తుందని  ‘ఐసీసీ’పై సహ చట్టం ద్వారా, సంచలన నిజాలతో ఓ సామాజిక వేత్త ప్రత్యేక వ్యాసంతో బట్టబయలు చేశారు.. “మహిళలు- బాలికలకు హక్కులు, న్యాయం, చర్యలు” ఈ మూడింటిపై పని ప్రదేశాల్లో భద్రతకు “అంతర్గత ఫిర్యాదుల కమిటి (ఐసిసి) బలోపేతం ఆవశ్యకత తక్షణమే అత్యవసరమని మధుబాబు చికిలే పేర్కొన్నారు.. మార్చి 8న జరుపుకునే ఈ  అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. అది సమాజం తన మనసును పరిశీలించుకునే రోజు.. మహిళలు నిజంగానే గౌరవంతో, భద్రంగా జీవిస్తున్నారా..? వారి హక్కులు కేవలం నినాదాలుగా మిగిలిపోయాయా..? లేక నిజంగానే అమలవుతున్నాయా..? అనే ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధుబాబు చికిలే ప్రత్యేక వ్యాసం సమాజంలో పలువురిని ఆలోచింప చేస్తున్న శీర్షిక ‘పెన్ పవర్’ దినపత్రికలో  ప్రత్యేకం..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మార్చి 8:

ఈ ఏడాది మహిళా దినోత్సవం థీమ్ “మహిళలకు, బాలికలకు హక్కులు : న్యాయం- కార్యాచరణ” ఈ మూడు పదాలు ఒక సమాజ పురోగతిని కొలిచే ప్రమాణాలుగా నిలుస్తాయి.. ముఖ్యంగా మహిళలు పనిచేసే కార్యాలయాలు, సంస్థలు ఈ మూడు విలువలను నిజంగా అమలు చేసినప్పుడే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుంది.. పనిచేసే ప్రదేశాల్లో భద్రత-హక్కుల మొదటి అడుగుగా చెప్పాలి.. మహిళలు ఉద్యోగం చేయడం ఒక అవకాశమే కాదు, అది వారి మౌలిక హక్కుగా భావించాలి… అయితే ఆ హక్కు నిజంగా అర్థవంతం కావాలంటే పని ప్రదేశం భద్రంగా ఉండాలి.. మహిళలు భయపడకుండా, గౌరవంతో పనిచేసే వాతావరణం కల్పించడమే నిజమైన అభివృద్ధికి సంకేతం.. ఈ అవసరాన్ని గుర్తించి భారతదేశంలో పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 అనే చట్టాన్ని అమలు చేసింది.. ఈ చట్టం ప్రకారం పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థలో “అంతర్గత ఫిర్యాదుల కమిటీలు”(ఐసిసి) ఏర్పాటు చేయడం తప్పనిసరిగా ఈ చట్టం ఉద్దేశం..

‘ఐసిసి’ అనేది ఒక కమిటీ మాత్రమే కాదు..! మహిళల గౌరవం..

ఇవన్నీ గణాంకాలు చెప్పే వాస్తవం.. అధికారిక వివరాలు పరిశీలిస్తే ప్రభుత్వ విభాగాల్లో ఐసిసి ల ఏర్పాటు కొంత మేర జరిగిందని తెలుస్తోంది.. జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన “ఐసిసి లు-1808” ఉపజిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన “ఐసిసి లు-1881” అదేవిధంగా జిల్లాల వారీగా ప్రైవేట్ రంగంలో “740 ఐసిసి”లు మాత్రమే నమోదు అయ్యాయి.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ సంస్థలు ఉండటం వల్ల అక్కడ ఐసీసీ’లు ఎక్కువగా ఉన్నాయి.. అయితే ఈ సంఖ్యలు చూస్తే మరో నిజం కూడా బయటపడుతోంది.. ఇంకా అనేక సంస్థల్లో “అంతర్గత ఫిర్యాదుల కమిటిలు” లేవని స్పష్టమవుతుందని మధుబాబు చికిలే ఈ వ్యాసంలో ప్రస్తావించారు..

హక్కులు-న్యాయం-చర్యలు..

మహిళా దినోత్సవం థీమ్‌లోని మూడు పదాలు మనకు ఒక స్పష్టమైన దిశను చూపిస్తున్నాయి.. అందులో మొదటిది..
(1)హక్కులు..! మహిళలకు పనిచేసే హక్కు మాత్రమే కాదు, గౌరవంగా పనిచేసే హక్కు, భయంలేకుండా పనిచేసే హక్కు, వేధింపులు లేకుండా జీవించే హక్కులు కూడా ఉన్నాయి. అంతర్గత ఫిర్యాదుల కమిటి వ్యవస్థ ఈ హక్కులను రక్షించే విభాగంలో ఒక ముఖ్యమైన యంత్రాంగం.. రెండవది (2)న్యాయం..! పని ప్రదేశంలో వేధింపులకు గురైన మహిళకు త్వరితగతిన న్యాయం అందాలి.. ‘అంతర్గత ఫిర్యాదుల కమిటి’ వలన ఫిర్యాదు చేయడానికి ఒక అధికారిక వేదికగా ఉంటుంది.. విచారణ వేగంగా జరిగేందుకు దోహదపడుతుంది. బాధితురాలికి రక్షణ లభిస్తుంది.. ఇక మూడవది.. (3)చర్యలు..! ఇప్పుడు అత్యంత అవసరమైన మూడవ అంశం చర్యలు..నేటికీ అనేక రంగాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటిలు ఏర్పాటు కాలేదు. ప్రత్యేకంగా చెప్పాలంటే చిన్నపాటి ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం, సేవారంగ సంస్థలు.. ఇవి మహిళలు ఎక్కువగా పనిచేసే రంగాలు. కాబట్టి అక్కడ అంతర్గత ఫిర్యాదుల కమిటి వ్యవస్థ బలపడాలని మధుబాబు చికిలే అభిప్రాయపడ్డారు..

మహిళల భద్రతే- సమాజ పురోగతికి పునాది..!

ఒక దేశం అభివృద్ధి చెందిందని చెప్పాలంటే మహిళలు భయపడకుండా పనిచేసే వాతావరణం ఉండాలి.. భద్రత లేని చోట ప్రతిభ కూడా వికసించదు.. మహిళల గౌరవాన్ని కాపాడే కార్యాలయాలే నిజమైన అభివృద్ధికి సూచికలు.. ఒక సామాజిక స్పృహ, సంకల్పంతో, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఒక స్పష్టమైన సంకల్పం తీసుకోవాలని ఆయన సూచించారు.. ప్రతి సంస్థలో ‘అంతర్గత ఫిర్యాదుల కమిటి’ (ఐసిసి) ఉంటే..! ప్రతి మహిళకు భద్రత కల్పించవచ్చు.. అలాంటి సందర్భంలో మాత్రమే మహిళల హక్కులు నిజంగా అమలవుతాయి.. అప్పుడు మాత్రమే న్యాయం అందుతుంది, చర్యలు ఫలిస్తాయి.. మహిళల భద్రత ఒక చట్టం వల్ల మాత్రమే సాధ్యం కాదు. సమాజం మొత్తం కలిసొచ్చినప్పుడు మాత్రమే అది నిజమవుతుందని, ప్రపంచ మానవహక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే “పెన్ పవర్”తో పేర్కొన్నారు..