గంగవరం, పెన్ పవర్, మార్చి 28:
గంగవరం మండలానికి చెందిన గిరిజన మహిళ, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభకు అరుదైన గౌరవం దక్కింది. రేపు మంగళగిరిలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేదికను అలంకరించే అవకాశాన్ని పార్టీ ఆమెకు కల్పించడం విశేషంగా నిలిచింది. ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తోపాటు 19 మంది మాత్రమే ఉండే సభా వేదికపై డాక్టర్ తీగల ప్రభ కు అవకాశం కల్పిస్తూ మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి శనివారం రాత్రి ఆహ్వానం అందింది .గత 22 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో అంకితభావంతో పనిచేస్తూ, గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన తీగల ప్రభ సేవలను పార్టీ ఉన్నత నాయకత్వం గుర్తించింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంలో ఆమె పాత్ర ప్రశంసనీయమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.ఈ అరుదైన అవకాశంపై తీగల ప్రభ హర్షం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత కృషి చేసి పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని ఆమె పేర్కొన్నారు.