PEN POWER
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:41 pm Posted By : SRIKANTH NARASIMHALA

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 23 :

ఎడ్లపాడు : మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతుల పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ డిమాండ్ చేసింది.

మండలంలోని వేలాది ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఎక్కువ మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే కావడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని పంటను సాగు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇతర పంటలు నష్టపోవడంతో మొక్కజొన్న సాగుపై రైతులు ఆధారపడినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం పంట చేతికి వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల క్వింటాకు సుమారు రూ.700 వరకు నష్టం వాటిల్లుతోందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2400 ఉన్నప్పటికీ అమలు చేయడంలో ఆలస్యం జరుగుతోందని విమర్శించారు. అందువల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. లేకపోతే వ్యవసాయం రైతులకు మరింత భారంగా మారే పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు.