PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 10:35 am Posted By : PEN POWER MEDIA

రాజ్యసభకు యనమల, సానా..!

  •  ఏపీలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లు
  •  కూటమిలో సీట్ల పంపకం పై ఆసక్తికర సమీకరణాలు
  •  సానా సతీష్‌కు రీన్యువల్ దాదాపు ఖాయం
  •  టీడీపీకి కొత్తగా ఒక్క సీటే మిగిలే పరిస్థితి
  •  టీడీ జనార్ధన్ పేరు రేసులో ముందంజ
  •  యనమల రామకృష్ణుడి చిరకాల కోరిక రాజ్యసభే
  •  సీనియర్ నాయకత్వం – యనమలకు ప్రధాన బలం
  •  బీసీ కోటా సమీకరణలు – అవకాశాలు పెరిగిన వేళ
  • చంద్రబాబు సన్నిహితుడిగా యనమలకు ప్లస్ పాయింట్
  • చివరి నిమిషం ట్విస్ట్ ఉంటుందా? నిర్ణయం పై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలపై రాజకీయంగా భారీ చర్చ మొదలైంది. ముఖ్యంగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ లో రాజ్యసభ రేసు ఉత్కంఠగా మారింది. సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు కు ఈసారి అవకాశం దక్కుతుందనే ప్రచారం వేడెక్కగా,సానా సతీష్‌ కు రీన్యువల్ దాదాపు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

కాకినాడ, పెన్ పవర్, మార్చి 24:

కూటమిలో రాజ్యసభ రేసు ఆసక్తికరంగా మారింది. త్వరలో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. దీంతో పెద్దల సభ రేసులో..తెలుగు తమ్ముళ్లు పెద్ద క్యూ కట్టారు. పైరవీల పర్వం నెక్స్ట్‌ లెవల్‌కు చేరుకుంది. నాలుగు స్థానాల సీట్లలో టీడీపీకి రెండు, జనసేన, బీజేపీకి చెరో సీటు దక్కే అవకాశం ఉంది. టీడీపీకి దక్కే రెండింటిలో గతేడాది ఎన్నికైన సానా సతీష్ ఏడాదిన్నరలోనే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయనకు మళ్లీ రెన్యూవల్ చేస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీకి కొత్తగా దక్కేది ఒక్క సీటేనన్న అంచనాలు ఉన్నాయి.ఆ ఒక్క సీటు కోసం టీడీ జనార్ధన్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన సీఎం చంద్రబాబు రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. టీడీపీ మాజీ పొలిట్‌ బ్యూరో మెంబర్‌, గతంలో ఎమ్మెల్సీ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీ జనార్ధన్‌ను రాజ్యసభకు పంపితే..ఢిల్లీ పనులన్నీ చక్కబెడతారని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే టైమ్‌లో మరో సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు రాజ్యసభ బెర్త్‌ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి యనమల రామక్రిష్ణుడు పార్టీలో ఉన్నారు. 1983లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి..ఎన్టీఆర్ మంత్రి వర్గంలోనే కీలక మంత్రి పదవులు నిర్వహించారు. ఇక చంద్రబాబు హయాంలో స్పీకర్‌గానే కాకుండా ఆర్థిక మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేస్తూ ఎన్నో బడ్జెట్లను ప్రవేశపెట్టారు. పన్నెండేళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే యనమల చిరకాల కోరిక రాజ్యసభకు వెళ్లాలని. దశాబ్ధ కాలంగా ఆయన పెద్దల సభకు వెళ్లాలని ఆశపడుతున్నారు. కానీ ఇప్పటివరకు అవకాశం లేదు.ఇప్పుడా ఆ ముహూర్తం దగ్గర పడిందా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అయితే సానా సతీష్‌కు రెన్యూవల్‌ చేయగా..మిగిలిన సీటును సీనియర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్లు టాక్. పైగా ఆ సీటు బీసీలకు ఇస్తారని అంటున్నారు. ఈ రెండు ఈక్వేషన్స్ బట్టి చూస్తే యనమల స్వీట్‌ న్యూస్ పక్కా అన్న మాట బలంగా వినిపిస్తోంది. గతేడాది మార్చిలోనే ఆయన ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసింది. దీంతో పెద్దాయనకు సముచితమైన గౌరవం దక్కాలంటే కచ్చితంగా రాజ్యసభకు పంపడమే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.యనమల చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఆంతరంగికుడిగా మెలుగుతారు కూడా. ఇద్దరూ సమ వయస్కులు. ఇద్దరూ రాజకీయంగా కలసి మెలసి ఉంటూ టీడీపీలో కీలక దశకు చేరుకున్న వారు. దాంతో చంద్రబాబు తన మిత్రులకు..పైగా సీనియర్లకు గౌరవనీయమైన స్థానం కల్పించే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. గతేడాది సీనియర్ లీడర్‌ అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్‌గా అవకాశం దక్కింది. ఇప్పుడు మరో సీనియర్ నేత యనమల వంతు వచ్చిందని..ఆయనకు రాజ్యసభ సీటు రిజర్వ్ అయిందని చెబుతున్నారు. త్వరలోనే చంద్రబాబు నోట యనమలకు గుడ్ న్యూస్‌ను వినిపించబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.అయితే ఈ మధ్యే యనమల అల్లుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం పెద్ద రచ్చగా మారింది. ఆ ఎఫెక్ట్‌తో యనమల అవకాశాలు ఏమైనా పోతాయా అనే ప్రచారం నడుస్తుండగా..అలాంటిదేమీ లేదని అంటున్నారు. యనమల టీడీపీ పుట్టినప్పటి నుంచి నిబద్ధతతో పార్టీకి సేవ చేస్తున్న లీడర్‌. ఆయన అనుభవం, పార్టీకి చేసిన సేవ లెక్కలోకి వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి యనమల పెద్దల సభలోకి అడుగు పెట్టాలన్న కోరిక మరో రెండు నెలలలో తీరిపోతుందని అంటున్నారు. లాస్ట్‌ మినిట్‌ ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? లేక యనమలకు బెర్త్ పక్కానా అనేవి చూడాలి.