జగన్ రాష్ట్ర యువతను మాదకద్రవ్యాలకు..కల్తీ మద్యానికి బానిసల్ని చేస్తే.. లోకేశ్ ఉద్యోగాలు..ఉపాధి కల్పనకు బానిసల్ని చేస్తూ.. రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాముల్ని చేస్తున్నారు : ప్రత్తిపాటి
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 20:
చిలకలూరిపేట : రాష్ట్ర యువత జీవితాల్ని గొప్పగా సంస్కరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు మంత్రి లోకేశ్. ఆంధ్రా యువతకు దొరికిన అభినవ వివేకానందుడు లోకేశ్. వివేకానందుడి స్ఫూర్తితో.. విజనరీ నాయకుడు.. తన తండ్రి.. ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లో ఏపీని జాబ్ క్రియేట్ స్టేట్ గా మార్చేందుకు లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వం నుంచి 6 లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ యువత ఆశలను నిజం చేశారు లోకేశ్.
తెలుగు సంవత్సరాది నాడు… 10,060 ఉద్యోగాల భర్తీతో కూడిన జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ద్వారా లోకేశ్.. నిరుద్యోగ యువత బంగారు భవితకు బలమైన పునాది వేశారు.
ఉద్యోగాల కల్పన.. నైపుణ్యాభివృద్ధి శిక్షణపై దృష్టి పెట్టిన ఏకైక నాయకుడు లోకేశే..
పెట్టుబడుల ఆకర్షణతో పరిమితం కాకుండా.. రాష్ట్రానికి వచ్చే ప్రతి పెట్టుబడిదారుడిని అభివృద్ధిలో భాగస్వామిని చేస్తున్నారు లోకేశ్. దేశ, విదేశీ పెట్టుబడులన్నీ గ్రౌండింగ్ అయ్యేలా ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోన్న లోకేశ్.. మరోపక్క ఏపీ యువత శక్తిసామర్థ్యాల్ని దేశప్రగతికి వినియోగించుందుకు సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి శిక్షణపై దృష్టి పెట్టారు. విద్యార్థి దశలోనే కాలానుగుణంగా మార్పులు చెందే పరిజ్ఞానంపై చిన్నారులకు అవగాహన కల్పించే చర్యలకు లోకేశ్ ఇప్పటికే శ్రీకారం చుట్టారు. గతంలో జగన్ యువతను మాదకద్రవ్యాలకు బానిసల్ని చేసి రాష్ట్రాభివృద్ధిని విస్మరిస్తే.. నేడు లోకేశ్ ఉద్యోగాలు…ఉపాధికి బానిసల్ని చేసి, యువశక్తితో అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నాడు. ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏకైక యువ నాయకుడిగా లోకేశ్ నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం 20లక్షల ఉద్యోగాల కల్పననే లక్ష్య సాధన కోసం లోకేశ్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.