Date of Publish : 28 March 2026, 3:37 pmPosted By : YEDUKONDALU DADALA
రైతుల అభివృద్ధితోనే దేశ సమగ్రాభివృద్ధి
రామచంద్రపురం, పెన్ పవర్,మార్చి 28:
పాడి రైతుల అభివృద్ధి, ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న పాడి రైతుల విజ్ఞాన యాత్ర బస్సును రామచంద్రపురంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం,ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఆత్మ ఏడి బి. నాగకుమార్, పశుసంవర్ధక శాఖ ఏడీఓ రామకృష్ణ జెండా ఊపి బస్సును ప్రారంభించారు.ఈ విజ్ఞాన యాత్ర ద్వారా రైతులకు ఆధునిక పాడి పశు సంరక్షణ, పాల ఉత్పత్తి పెంపు పద్ధతులపై అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా వెంకట రామన్నగూడెం పశు రీసెర్చ్ సెంటర్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రైతులను సాంకేతికంగా అభివృద్ధి చేయడం ఈ యాత్ర ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, “రైతులు అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికంగా బలపడుతుంది.పాడి రైతుల విజ్ఞాన యాత్ర ద్వారా పాల ఉత్పత్తి పెంపు, పశు సంరక్షణలో నూతన పద్ధతులపై రైతులకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది” అని అన్నారు. పాడి, పశుసంరక్షణ రంగాలకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆర్థికంగా బలపడితేనే దేశం సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ మాట్లాడుతూ, రామచంద్ర పురం నియోజకవర్గం నుంచి మొత్తం 41 మంది రైతులను ఈ విజ్ఞాన యాత్రకు పంపుతున్నట్లు తెలిపారు. అందులో కె. గంగవరం మండలం నుంచి 20 మంది, రామచంద్రపురం మండలం నుంచి 21 మంది రైతులు పశు వైద్యాధికారులతో కలిసి విజ్ఞాన యాత్రకు వెళ్లారని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పాడి పరిశ్రమలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కె.గంగవరం మండల పశువైద్యాధికారిణి భావన జ్యోతి, పేకేరు పశువైద్యాధికారి సురేష్ బాబు, వెల్ల పశువైద్యాధికారి అనిల్ విల్సన్, సిబ్బంది, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉండవల్లి శివ, ఉపాధ్యక్షులు చందమామ వాసు, ఏఎంసీ డైరెక్టర్ నారపురెడ్డి బలరాం, క్లస్టర్ ఇన్‌చార్జ్ కంచుమర్తి బాబురావు, మేడిశెట్టి సూర్యనారాయణ, పలువురు కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.రైతుల ఆదాయాన్ని పెంచడం, పాడి రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ విజ్ఞాన యాత్ర ఒక కీలక అడుగు అని నాయకులు అభిప్రాయపడ్డారు.