PEN POWER
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 2:34 pm Posted By : PEN POWER MEDIA

వర్క్ ఫ్రమ్ హోమ్ రాజకీయాలపై విమర్శలు

  • అసెంబ్లీ గడప దాటని ప్రతిపక్ష నేత

  • కోటి రూపాయల జీతంపై దుమారం

  • గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు?

  • ప్రజాస్వామ్య బాధ్యతలపై ప్రశ్నలు

  • గవర్నర్ ప్రసంగానికి గైర్హాజరు వివాదం

  • “తెలంగాణ రైజింగ్ 2047”పై సెటైర్లు

  • ప్రతిపక్ష వైఖరిపై సీఎం ఆగ్రహం

  • సభకు రాకుండా జీతం తీసుకోవడంపై చర్చ

  • రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌పై విమర్శలు

  • వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ సెటైర్లు

 

అసెంబ్లీకి దూరంగా ఉంటూనే జీతభత్యాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నేతపై తెలంగాణ రాజకీయాల్లో చర్చలు రగులుతున్నాయి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేస్తూ “వర్క్ ఫ్రమ్ హోమ్ పాలిటిక్స్”పై సెటైర్లు పేల్చడం హాట్ టాపిక్‌గా మారింది.

 

 హైదరాబాద్, పెన్ పవర్ మార్చి20 :

సాధారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. కానీ ఒక రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ సభ గడప తొక్కకుండానే “అటెండెన్స్ అక్కర్లేని అసాధారణ ఉద్యోగి” గా కొత్త రికార్డు సృష్టించారు మన గులాబీ బాస్. ‘రాజ్యం పోయినా రాచరికం పోలేదు’ అన్న సామెతను నిజం చేస్తూ గజ్వేల్ ఫామ్ హౌస్ నుంచే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్న తీరుపై ఇప్పుడు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.సామాన్యుడు ఒక్క రోజు ఆఫీస్ మానేస్తే జీతంలో కోత పడుతుంది. కానీ మన ప్రతిపక్ష నేత గారికి మాత్రం ఇప్పటి వరకు అక్షరాలా రూ. 1.06 కోట్ల జీతభత్యాలు ప్రభుత్వం చెల్లించింది. సభకు వచ్చి ప్రజా సమస్యలపై గళం ఎత్తాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, కేవలం అకౌంట్‌లో పడే మెసేజ్‌లకే పరిమితమైన ఈ ‘రాజకీయం’ చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. “కోటి రూపాయల జీతం తీసుకుంటూ కోలుకోలేని నిద్రలో ఉండటం” అంటే ఇదేనేమోనని చర్చించుకుంటున్నారు.గవర్నర్ శివప్రతాప్ శుక్లా అసెంబ్లీలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ అంటూ భవిష్యత్ ప్రణాళికలు వివరిస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం మాత్రం “మేము రాము.. మాకు ఆ విజన్ డాక్యుమెంట్లు పట్టవు” అన్నట్లుగా వ్యవహరించింది. దీనిపై రేవంత్ సెటైర్ వేశారు. ఏఐ (AI) సునామీ రాబోతోందని గవర్నర్ చెబితే, ప్రతిపక్షం మాత్రం ఇంకా పాత రికార్డులే వేస్తోంది. కనీసం విజన్ డాక్యుమెంట్ చదివారా? అంటే.. “మాకు అధికారం పోయిన దుఃఖం చదవడానికే టైమ్ సరిపోవడం లేదు” అన్నట్లుగా ఉందని ఎద్దేవాచేశాడు.నాలుగు కోట్ల మంది ప్రజలు తమ గొంతుక వినిపిస్తారని అసెంబ్లీ వైపు చూస్తుంటే, ప్రతిపక్ష నాయకుడు మాత్రం గవర్నర్‌కు కనీసం శుభాకాంక్షలు చెప్పడానికి కూడా రాలేదు. సభకు రాకుండా జీతం తీసుకోవడం అనేది ఒక “మాయని మచ్చ” అని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అంటే విధులకు హాజరు కాకుండా జీతం తీసుకునే ఈ కొత్త ట్రెండ్‌పై ఇప్పుడు స్పెషల్ క్లాస్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం అనేది ‘కళ’ అయితే.. అందులో కేసీఆర్ గారు ‘ఆస్కార్’ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ ‘కోటి రూపాయల అటెండెన్స్’ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి!