PEN POWER
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 9:29 am Posted By : Ratnam D

వామ్మో.. పోలవరం జిల్లాలోకి మళ్లీ పెద్దపులి

పెన్ పవర్ రంపచోడవరం

ఇటీవల కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన పెద్దపులి మరోసారి పోలవరం జిల్లాలోకి ప్రవేశించడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం రాత్రి రాజవొమ్మంగి మండలంలోని కొండలింగంపర్తి, కొత్తపల్లి గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు నిర్ధారణ అయింది.

స్థానికులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అటవీ అధికారులు వెంటనే పరిశీలన చేపట్టి, పులి కాళ్ల ముద్రలు, ఇతర ఆనవాళ్లను గుర్తించారు. ప్రస్తుతం ఈ పెద్దపులి బోర్నగూడెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

అటవీశాఖ అధికారులు అప్రమత్తమై పులి కదలికలను నిరంతరం గమనిస్తూ ట్రాకింగ్ చర్యలు చేపట్టారు. గ్రామాల పరిసర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు అడవికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులను బయటకు వదలకుండా కట్టుదిట్టమైన భద్రత పాటించాలని సూచించారు.

అదేవిధంగా, పులిని సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించే చర్యలు కూడా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే ట్రాంక్విలైజ్ చేసి పట్టుకునే చర్యలు కూడా పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు.

ప్రస్తుతం పరిస్థితిపై అటవీశాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తుండగా, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు.