శ్రీ మరిడీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర, పూర్వపరాలు
నర్సీపట్నం, పెన్ పవర్ :
పూర్వం శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ప్రస్తుత తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని రావిచెట్టు తొర్రలో ఉండేది. అప్పుడు స్వర్గీయ లత్సాపాత్రుడు అల్లుడైన చింతకాయల వరహాలు దొర ఆధ్వర్యంలో మరిడమ్మ ఉత్సవాలు జరిగేవి. ఈ అమ్మవారి జాతరకు ముగింపులో జరిగే బాణాసంచా పోటీలు ఆది నుండి ఆసక్తికరంగా ఉండేవి. అయితే ఈ ప్రదేశంలో స్థలాభావం వల్ల జాతర నిర్వహణ కష్టంగా ఉండడంతో అమ్మవారి ఆలయాన్ని అబీద్ సెంటర్లోని ఇందిరా మార్కెట్లోకి తరలించారు. చింతకాయల వరహాలు దొర ఆధ్వర్యంలో అడుగుకు ఒక మేకపోతును బలి ఇచ్చి, అమ్మవారిని ఇందిరా మార్కెట్లో ఉంచి, అక్కడ చిన్న ఉపాలయాన్ని నిర్మించారు.

ఇక్కడ కూడా అమ్మవారి జాతర నిర్వహణ ఇబ్బందిగా మారడంతో, అమ్మవారిని పెద్ద చెరువు వద్దకు తరలించి, అక్కడ చిన్న పాకలో ఉంచారు. తర్వాత తాత, తండ్రుల నుంచి వారసత్వం అందుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తమ ఇలవేల్పు అయిన అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు.

భారీ వ్యయంతో, పెద్దాపురం నుండి శిల్పులను రప్పించి, 12 రోజులు పాటు యజ్ఞ యాగాలు నిర్వహించి అమ్మవారికి పెద్ద ఆలయమే నిర్మించారు. అమ్మవారి మూల విరాట్ కు ప్రాణ ప్రతిష్ట జరిపించి, అర్చకులను ఏర్పాటు చేసి, నిత్యం ధూప దీప నైవేద్యాలు ఇబ్బందులు లేకుండా తానే స్వయంగా నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. అమ్మవారికి ఎలాంటి మడులు, మాన్యాలు, ఇతర ఆదాయాలు లేనందున అయ్యన్న కుటుంబమే నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. అప్పటినుండి రెండేళ్ల కోమారు అమ్మవారి జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మరిడమ్మ జాతర నిర్వహిస్తారు. అమ్మవారి గరగలను 11 రోజులు ముందుగానీ, తొమ్మిది రోజులు ముందుగానీ, ఏడు రోజులు ముందుగానీ తీయడం జరుగుతుంది. హరిజన వీధిలో మర్రా నూకాలమ్మ ఇంటి వద్ద ఉండే ఈ గరగలను దూపదీప నైవేద్యాలతో, డప్పులు, డోలు సన్నాయి వాయిద్యాలతో ఊరేగింపుగా మొట్టమొదటిగా స్వర్గీయ రుత్తల లత్సాపాత్రుడు ఇంటికి తీసుకురావడం ఆనవాయితీ.

ఆ ఇంటి వద్ద అమ్మవారి గరగలకు మొదటి పాన్పు వేసి పసుపు కుంకుమలు సమర్పించిన అనంతరం, పురవీధులలో ఊరేగిస్తారు. అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు వెంటరాగా తమ అనుచర గణంతో డబ్బులు, వాయిద్యాలతో అత్యంత వైభవంగా ఈ గరగలను గ్రామంలో ప్రతి వీధిలో తిప్పడం జరుగుతుంది. పెద్ద జాగరణ అనంతరం పండుగ రోజు సాయంత్రం సాంప్రదాయ బద్ధంగా అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద నుంచి జాతర మొదలవుతుంది. శక్తి వేషాలు, రెల్లి డ్యాన్సులు, నేల డాన్సులు, కోలాటాలు ఇలా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అశేష జనవాహిని తరలిరాగా అమ్మవారి గుడికి జాతర చేరుతుంది. అక్కడ పసుపు కుంకుమలు సమర్పించిన అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తరువాత జరిగే బాణాసంచా పోటీలు ఈ జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ ఏడాది అమ్మవారి జాతర నిర్వహణను అయ్యన్న కుమారులు చింతకాయల విజయ్, రాజేష్ లు తమ బాధ్యతగా తీసుకున్నారు. జాతర నిర్వహణ ఏర్పాట్లను వారిద్దరు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిబిఎం కాంపౌండ్ నుండి శ్రీకన్య జంక్షన్ వరకు ప్రతి జంక్షన్లోనూ ఒక స్టేజ్ ప్రోగ్రామును ఏర్పాటు చేశారు. ఊరంతా విద్యుత్ దీపాలంకరణలు చేశారు. ప్రజలంతా ఉత్సాహంగా జాతరలో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొంది, జాతరను విజయవంతం చేయాలని చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు.