సృష్టి క్షేత్రం నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు…
కడుతున్న తీరు వివాదాస్పదం…
-ఎవరి అనుమతితో పెద్ద చెరువులో నిర్మాణాలు చేపట్టారు
-మీ సొంత స్థలంలో కడితే మాకు అభ్యంతరం లేదు
-ఆయకట్టు రైతులతోనైనా మాట్లాడారా?
-ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం
-స్పీకర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే గణేష్ ఫైర్
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దచెరువులో సృష్టి క్షేత్రం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కడుతున్న తీరు వివాదాస్పదమని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పెదబొడ్డేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దచెరువు ఆయకట్టు రైతులు పెద్ద చెరువులో ఏకపక్షంగా నిర్మాణాలు చేస్తున్నారని, అధికారులు స్పందించడం లేదని, మీరైనా న్యాయం చేయాలని తనకు వినతిపత్రం ఇచ్చినట్లు గణేష్ తెలిపారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వచ్చిన గంటలోనే మేము కోర్టుకు వెళుతున్నట్లు స్పీకర్ పిఏ మెసేజ్లు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారందరి పైన గంటల వ్యవధిలోనే అధికారుల దాడులు జరిగాయని ఫోటోలుతో వివరించారు. అయితే తాము ప్రజలకు వివరణ ఇవ్వాలని ఈ మీడియా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అసలు ఎవరి అనుమతితో ఇరిగేషన్ చెరువు పై నిర్మాణాలు చేపట్టారని ప్రశ్నించారు. మీ సొంత స్థలంలో ఎన్ని అడుగుల విగ్రహాలు పెట్టుకున్న తమకు అభ్యంతరం లేదని, సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందించే పెద్దచెరువుపై, ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారని నిలదీశారు. ఆయా శాఖల అనుమతి గాని, ఆయకట్టు రైతులతో చర్చించడం గాని, నర్సీపట్నంలో అఖిలపక్ష పార్టీలతో సమావేశం గాని నిర్వహించారా అని ప్రశ్నించారు. నాతవరం మండలం గుమ్మడికొండలో నల్లమారమ్మ గుడి నిర్మాణాన్ని అడ్డుకున్నప్పుడు దైవత్వం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తన సొంత గ్రామం బాపిరాజు కొత్తపల్లి చెరువులో విగ్రహం పెట్టడానికి నిర్ణయించి, పంచాయతీ తీర్మానం తీసుకుని, పంచాయతీలో అన్ని పార్టీల నాయకులతో సంప్రదించి, గ్రామ పెద్దలతో మాట్లాడి, అప్పుడు నిర్మాణం చేపట్టానని గుర్తు చేశారు. పక్క జిల్లా అల్లిపూడి నుండి వచ్చిన మీరు, నన్ను నాన్ లోకల్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. పక్క జిల్లా నుండి వచ్చి లేటరైట్ లో కోట్లు దోపిడీ చేస్తున్నారని, రోలుగుంట మండలంలో నల్లరాయి క్వారీలపై ఏపి టాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు. నర్సీపట్నంపై విషం కక్కుతున్నామని తమపై పదేపదే విమర్శలు చేసే బదులు, న్యాయబద్ధంగా తగిన అనుమతులతో అభివృద్ధి పనులు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. తమ సొంత జాగీరులా, అడ్డగోలుగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, మాజీ వైస్ ఛైర్మన్ కోనేటి రామకృష్ణ, పట్టణ పార్టీ అద్యక్షుడు ఏకా శివప్రసాద్, మాజీ కౌన్సిలర్ బుల్లిదొర పాల్గొన్నారు.