PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 4:56 pm Posted By : PEN POWER MEDIA

స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్

  • ఆంధ్రప్రదేశ్‌లో మెగా స్టీల్ ప్లాంట్‌పై రాజకీయ క్రెడిట్ పోరు
  • ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు చేత శంకుస్థాపన
  • మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రెడిట్ తనదేనని వ్యాఖ్యలు
  • దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌తో జరిగిన చర్చలు ప్రస్తావన
  • “క్రెడిట్ చోరీ” ఆరోపణలపై టీడీపీ ఘాటైన కౌంటర్
  • జగన్ వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతల ప్రతిస్పందనలు
  • ₹1.36 లక్షల కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్ట్ ప్రాధాన్యం
  • లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్న ప్రాజెక్ట్
  • 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభ లక్ష్యం
  • ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన స్టీల్ ప్లాంట్ వివాదం

విశాఖపట్టణం పెన్ పవర్, మార్చి 27:

 

అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజయ్యపేట లో ఏర్పాటు కానున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద క్రెడిట్ వార్ నడుస్తోంది. మార్చి 23, 2026న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, దీనిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి టీడీపీ ఇచ్చిన కౌంటర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయితాడేపల్లిలో అద్దంకి పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టుకు పునాది పడింది తన హయాంలోనే అని స్పష్టం చేశారు. 2022లో దావోస్ పర్యటనలో తాను ఆదిత్య మిట్టల్‌తో చర్చలు జరిపానని, నక్కపల్లితో పాటు పలు ప్రాంతాలను వారికి చూపించామని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందే ఈ ప్లాంట్ ఖరారైందని, ఇప్పుడు చంద్రబాబు దీనిని తన ఖాతాలో వేసుకోవాలని చూడటం క్రెడిట్ చోరీ అని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. గతంలో జగన్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ ఒడిశాలో వస్తోంది.. బాబు మాత్రం ఏపీకి వస్తుందంటూ జనం చెవిలో పూలు పెడుతున్నారు అని అన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఒడిశాకు వెళ్తుందన్న ప్లాంట్ ఇప్పుడు ఏపీకి ఎలా వచ్చింది? మీ హయాంలో ఒప్పందం జరిగితే అప్పుడే ఎందుకు శంకుస్థాపన చేయలేదు? అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.సుమారు 1.36 లక్షల కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే పెద్దదని ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభం కావచ్చని అధికారులు వెల్లడించారు.ఒకవైపు వైఎస్సార్‌సీపీ మేము తెచ్చిన ప్రాజెక్టును బాబు వాడుకుంటున్నారు అని ప్రచారం చేస్తుంటే, మరోవైపు టీడీపీ జగన్ హయాంలో పరిశ్రమలు పారిపోయాయి.. కూటమి ప్రభుత్వం వల్లే పెట్టుబడులు వస్తున్నాయి అని కౌంటర్ ఇస్తోంది. ఈ క్రెడిట్ వార్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.