PEN POWER
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 1:15 pm Posted By : Ratnam D

15లోగా సి.ఎస్.సి పనులను పూర్తి చేయాలి* ..జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి

 

స్టాఫ్ రిపోర్టర్‌ పెన్ పవర్, పార్వతీపురం. మార్చి 06: జిల్లాలోని కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ (CSC) పనులను లక్ష్య కాలపరిమితిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుండి ఆర్.డబ్ల్యూ.ఎస్ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన ప్రతి సి.ఎస్.సి పని పూర్తి కావడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఇంజనీరు తాము సాధించిన రోజువారీ ప్రగతిని వివరించాలని, దీనిని ఒక సవాలుగా తీసుకోవాలని సూచించారు. మార్చి 15వ తేదీ నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్‌లో ఉండకూడదని ఆయన గడువు విధించారు. ఒక పని జరుగుతున్నప్పుడు మిగిలిన పనులను నిలిపివేయడం సరికాదని, అన్ని పనులు సమాంతరంగా సాగాలని కలెక్టర్ ఉద్బోధించారు. పనుల నిర్వహణలో ప్రతి అధికారికి ఒక స్పష్టమైన ప్రణాళిక,వ్యూహం ఉండాలని, లక్ష్య సాధన పట్ల తపన చూపాలని అన్నారు. మంజూరైన ప్రతి పని తక్షణమే ప్రారంభం కావాలని, గ్రౌండింగ్ కాని పనులు ఏవీ ఉండకూడదని స్పష్టం చేశారు. పనులు ప్రారంభించినట్లుగా ఆధారంగా ఫోటోలు పంపాలని ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, నిధుల సాకుతో పనులను ఆపవద్దని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం తప్పనిసరిగా అవసరం ఉంటుందని, అందుకు తగినట్లుగా నిర్మాణాలు జరగాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా స్థలాభావం ఉంటే తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జల జీవన్ మిషన్, సి.ఎస్.సి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే ప్రారంభం కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్
కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఏ.విజయశాంతి, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.