227లో అక్రమ ధరణి రిజిస్ట్రేషన్‌లు.. రద్దు ప్రస్తావనేది..?
2022లో అక్రమ రిజిస్ట్రేషన్‌లు..! అక్రమార్కులకు వరంగా మారిందా..?
రూ.40 వేలకోట్లు విలువైన ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తారా..?
బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో “ఖరీదైన కబ్జాదారులు”..!
హైకోర్టు పరిధిలో ఉండగానే, 22-ఎ నిబంధనలకు తూట్లు..
ధరణీ రిజిస్ట్రేషన్‌లు చేసిన..! రెవెన్యూ యంత్రాంగం మౌనం వెనుక ఆంతర్యం..?
దాదాపు 25 ఏళ్లుగా హైకోర్టు పరిధిలో ఉన్న భూమిలో నిరభ్యంతర రిజిస్ట్రేషన్‌లు..!
22-ఎ నిషేధిత జాబితా ఉల్లంఘనలో ‘ఇద్దరు కలెక్టర్‌లు-ఇద్దరు తహసీల్దార్‌లు’..!
మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌లకు ‘కలెక్టర్-తహశీల్దార్’..
మంత్రులు–ఎమ్మెల్యేల పలుకుబడి రెవెన్యూ శాఖ చేతులు కట్టిపడేశాయా..?
అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చి ఏడాదిన్నర గడిచినా చర్య శూన్యం..!
ప్రభుత్వ భూమిలోనే సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా రూ.60 లక్షలు ప్రభుత్వ నిధులే..!
మేడ్చల్ జిల్లాలో ఏం జరుగుతోంది..? భూ కబ్జాలకు రెవెన్యూ యంత్రాంగం సపోర్ట్..?
బహుదూర్‌పల్లి సర్వే నెం.227లో జరుగుతున్న అక్రమాలు రెవెన్యూ శాఖ, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి భూకబ్జా కాంబినేషన్‌ను బయట పెడుతున్నాయి.. హైకోర్టు పరిధిలో ఉండగానే చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు కొనసాగటం, అధికారుల మౌనం, పలువురు అనుమానాలకు దారితీస్తుంది.. ఈ వ్యవహారం మొత్తంలో “తెలంగాణ సీసీఎల్ఏ కమిషనర్” కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అక్రమార్కులకు అసలు ఆధారాలే లేవని నిరూపించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్.. 2022లో ధరణి తప్పుడు రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయడానికి వెనకడుగు ఎందుకు..?
మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మార్చి 25:

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం బహుదూర్‌పల్లి గ్రామ శివారు సర్వే నెం.227లో సుమారు రూ.40 వేలకోట్లు విలువైన ప్రభుత్వ భూమి 353.35 ఎకరాలు.. అక్రమార్కులకు కట్టబెట్టేందుకు అంతర్గత చర్చలు ఏమైనా జరుగుతున్నాయా..? మేడ్చల్ జిల్లా రెవెన్యూ అధికారుల తీరు “దూడను పాలు త్రాగమని – గేదెను తన్నమని” అన్నట్టు ఉంది.. గత 25 సంవత్సరాలుగా హైకోర్టు ఆదేశాల మేరకు.. ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన కలెక్టర్‌లు, ‘2022-2023’లో తప్పుడు ధరణి రిజిస్ట్రేషన్‌లు అధికారుల అవినీతిని బట్టబయలు చేస్తోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. చివరికి బహుదూర్‌పల్లి 227లో చట్టాలు చల్లారి పోయాయా అనే అనుమానాలకు బలాన్ని ఇస్తుంది..! హైకోర్టులో ఉందన్న భయం, అటు అధికారుల్లోనూ – ఇటు కబ్జాదారుల్లోనూ లేకపోవడం గమనార్హం..

జాగీర్ భూముల రద్దుతో.. ప్రభుత్వ భూమిగా..
కలెక్టర్ జాగిరత్ కార్యాలయం నుండి 1938లో జారీ చేసిన ఒక లేఖ నిజమైనదేనా అనే అంశంపై విచారణ జరిగింది.. 2009లో కమిషనర్ స్పష్టం చేశారు.. జాగీర్ వ్యవస్థ 1358 ఫస్లీ (1948) చట్టం ప్రకారం రద్దు అయ్యింది.. జాగీర్ భూములు పరిపాలనా పరంగా ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి.. అందువల్ల పాత రికార్డులను ఇప్పుడు, ధృవీకరించడం సాధ్యం కాదని తెలిపారు.. మరోవైపు 227 భూమిని కొనుగోలు చేసిన వారకి ఇప్పటికీ మదర్ డాక్యుమెంట్లు లేవు.. 1965లో 227 ప్రభుత్వ భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్‌లు చేసిన నంబూరి కుటుంబానికి 227 భూమి ఎలా సంక్రమించిందో రుజువు చేయలేకపోయారని, కలెక్టర్ తీర్పులో నిర్ధారించారు.. అయినప్పటికీ 227 ప్రభుత్వ భూమి అక్రమార్కులకు ఆయుధంగా మారిన అంశం ఏమిటి..? 22-ఎ నిషేధిత జాబితాలో ఇళ్ళ ప్లాట్‌లుగా చూపిస్తున్న స్థలాన్ని..! 2022లో ఇద్దరు కలెక్టర్‌లు, ఇద్దరు తహశీల్దార్‌లు ఏ ఉద్దేశంతో ధరణి రిజిస్ట్రేషన్‌లు చేశారు..? ధరణి చట్టం సరైనది కాదని, భూ భారతి చట్టాన్ని అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. 227లో తప్పుడు ధరణితో చేసిన అక్రమ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయడానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు..?