ఆవిర్భావ సభ రద్దుతో జనసైనికుల్లో నిరాశ
పిఠాపురం సభపై భారీ అంచనాలు చెదిరాయి
సభ్యత్వ నమోదు పై అధిష్టానం పూర్తి దృష్టి
ఎండల తీవ్రత కారణంగా సభ రద్దు నిర్ణయం
రాష్ట్ర ఘటనల నేపథ్యలో వేడుకలకు బ్రేక్
కేడర్ ఉత్సాహంపై నీళ్లు చల్లిన నిర్ణయం
పవన్ కల్యాణ్ వ్యూహాత్మక నిర్ణయం?
భారీ సభ కోసం ఎదురుచూసిన యువత
త్వరలో మరో భారీ కార్యక్రమం ఉంటుందా?
జనసేన బలోపేతానికి కొత్త ప్రణాళికలు
కాకినాడ, పెన్ పవర్ మార్చి 11 :
జనసేన పార్టీఆవిర్భావ దినోత్సవం అంటే ఆ పార్టీ కేడర్‌కు ఒక పండగ. అణచివేతను ఎదిరించి, ప్రశ్నించే గొంతుకగా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, ఈసారి పిఠాపురం వేదికగా జరిగే వేడుకలు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తాయని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా పార్టీ అధిష్టానం ఈ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జనసైనికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.రాష్ట్ర రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ పెరుగుతున్న తరుణంలో, ఈ నెల 14న పిఠాపురంలో జరగాల్సిన పార్టీ ఆవిర్భావ సభ రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా అధినేత పవన్ కల్యాణ్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఈ సభ పార్టీ బలోపేతానికి ఒక దిక్సూచిలా మారుతుందని కేడర్ ఎంతో ఆశగా ఎదురుచూసింది. కానీ, ప్రస్తుత నిర్ణయం కార్యకర్తల ఉత్సాహంపై నీళ్లు చల్లిందనే చెప్పాలి.పార్టీ అధికారికంగా చెబుతున్న ప్రధాన కారణం సభ్యత్వ నమోదు. ఇప్పటివరకు దాదాపు 8.70 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు గడువు రేపటితో ముగియాల్సి ఉన్నా, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ గడువును పొడిగించే ఆలోచనలో అధిష్టానం ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని నిరూపించుకోవాలంటే గణాంకాలు ముఖ్యం కాబట్టి, సభ ఏర్పాట్ల కంటే సభ్యత్వాలపైనే పూర్తి దృష్టి పెట్టాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే సభ రద్దు వెనుక ఇతర బలమైన కారణాలున్నాయని సమాచారం. సభ్యత్వ నమోదుతో పాటు మరికొన్ని అంశాలు కూడా ఇందుకు దోహదం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేలాదిగా తరలివచ్చే కేడర్‌కు ఎండ దెబ్బ తగలకుండా చూడటం అధినేత బాధ్యతగా భావిస్తున్నారు. రాష్ట్రంలో జరిగిన కల్తీ పాలు, బాణాసంచా పేలుడు ఘటనలు పార్టీ వర్గాల్లో కొంత ఆవేదనను నింపాయి. ఇలాంటి సమయంలో భారీ వేడుకలు నిర్వహించడం సబబు కాదని పార్టీ భావించి ఉండవచ్చు. పిఠాపురం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం కావడంతో, అక్కడ ఎలాంటి అపశ్రుతులు జరగకూడదని, అత్యంత పకడ్బందీగా మరోసారి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.జనసేన పార్టీకి భావోద్వేగాలే బలం. పవన్ కల్యాణ్ పిలుపు కోసం ఎదురుచూసే లక్షలాది మంది యువత, పిఠాపురం వేదికగా ఆయన ఇచ్చే పొలిటికల్ స్పీచ్ కోసం సిద్ధమయ్యారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఇలాంటి భారీ బహిరంగ సభలు కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతాయి. ఇప్పుడు సభ రద్దు కావడంతో, క్షేత్రస్థాయిలో కేడర్ డీలా పడిపోయింది. పార్టీ బలోపేతం ముఖ్యమే కానీ కార్యకర్తల ఆత్మీయ కలయిక కూడా అంతే ముఖ్యమనేది సగటు జనసైనికుడి ఆవేదన.నిర్ణయం కఠినంగా ఉన్నా, పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. సభ రద్దుతో వచ్చిన అసంతృప్తిని పోగొట్టాలంటే, సభ్యత్వ నమోదులో రికార్డు సృష్టించడమే కాకుండా, త్వరలోనే మరో భారీ మేనిఫెస్టో సభ లేదా ప్లీనరీ లాంటి కార్యక్రమాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది.