- ఏప్రిల్ 30 డెడ్‌లైన్.. అజార్ మంత్రి పదవికి కీలక గడువు
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్‌తో పెరుగుతున్న ఉత్కంఠ
- సుప్రీంకోర్టు తీర్పేనా అజార్ రాజకీయ భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్?
- గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోతే ప్లాన్-B అమలుకు సర్కార్ రెడీ
- జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు అజార్ పదవి కీలక పరీక్ష
ఖమ్మం, పెన్ పవర్ ఏప్రిల్ 01:
అజారుద్దీన్ మంత్రి పదవి ఉంటుందా.. ఊడుతుందా.. తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరుగా వినిపిస్తున్న చర్చ ఇది. దీనికి కారణం.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడమే ! ఏ చట్టసభల్లో సభ్యుడిగా లేకపోయినా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా అజారుద్దీన్‌ను మంత్రిని చేసింది కాంగ్రెస్ సర్కార్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తూ రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ ఫైల్ గవర్నర్ దగ్గరే ఉంది. మంత్రి పదవి కొనసాగాలంటే.. ఆరు నెలల్లోగా శాసనసభ లేదా శాసన మండలిలో అజారుద్దీన్‌కు సభ్యత్వం తప్పనిసరి. ఐతే వచ్చే నెల 30వ తేదీతో.. ఆయన మంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు ముగుస్తుంది. ఇంకా 30 రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో.. ఇప్పుడేం జరగబోతుందనేది ఆసక్తి రేపుతోంది. గవర్నర్ దగ్గర ఫైల్ ఇలానే పెండింగ్‌లో ఉంటే పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఐతే దీనికి రేవంత్ సర్కార్ ప్లాన్ బీ సిద్ధం చేసిందనే టాక్ నడుస్తోంది.అక్టోబర్ 31న తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి 6 నెలల లోపు చట్టసభల్లో సభ్యుడు కావాలి. అంటే ఏప్రిల్ 30లోపు ఆయన చట్టసభల్లో సభ్యుడు కావాలన్న మాట. నాలుగు నెలల కిందటే.. కేబినెట్ ఆమోదించి గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్‌ను నామినేట్ చేసింది. ఐతే బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఫైల్‌ను గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. ఈ మధ్యే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. మరోసారి గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే.. హైకోర్టుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి విషయంలో ఏం జరగబోతుందనే ఆసక్తి కనిపిస్తోంది.ఈ మధ్యే రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చారు. దీంతో మరోసారి గవర్నర్‌ను కలిసేందుకు సీఎం రేవంత్ సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారం గవర్నర్‌తో భేటీ అయి.. అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరనున్నట్లు సమాచారం. మళ్లీ కోర్టుకు వెళ్తే ఆలస్యం అవడం తప్ప.. వచ్చే లాభం లేదని, వీలైనంత త్వరగా ఫైల్ క్లియర్ చేయాలని గవర్నర్‌ను ప్రభుత్వ పెద్దలు కోరనున్నారట. ఐతే సాంకేతిక కారణాలతో ఫైల్‌ను గవర్నర్ పెండింగ్‌లో పెడితే మాత్రం.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి గండం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయ్. దీంతో ప్రభుత్వ పెద్దలు ప్లాన్ B అమలు చేసేందుకు రెడీ అవుతున్నారట. ఒకవేళ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాకపోతే.. అజారుద్దీన్ చేత రాజీనామా చేయించి.. మే రెండో వారంలో జరిగే కేబినెట్ విస్తరణలో మరోసారి అవకాశం కల్పించాలనే ఆలోచన చేస్తున్నారని టాక్.ఓవరాల్‌గా లాస్ట్ బాల్‌కు అజారుద్దీన్ సిక్స్ కొడతారా.. డకౌట్ అవుతారా అనేది గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక అటు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయ్. ఇలాంటి సమయంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి దూరం అయితే.. కాంగ్రెస్‌కు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. దీంతో ఈ విషయంపై రేవంత్ సర్కార్ సీరియస్‌గా ఉంది. గవర్నర్ నిర్ణయం సానుకూలంగా లేకపోతే… ప్లాన్ B అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది