PEN POWER
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 9:14 am Posted By : A YESOBU

అణగారిన వర్గాల ఆశ జ్యోతి బాబు జగ్జీవన్‌రామ్…

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 5

పుల్లల చెరువు మండల కేంద్రంలో సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహానేత బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. భారత రాజకీయాల్లోనే కాకుండా, వెనుకబడిన వర్గాల హక్కుల సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు.ఈ సందర్భంగా లింగంగుంట్ల రాములు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆజన్మాంతం శ్రమించిన ధీశాలి బాబూ జగ్జీవన్ రామ్ అని, సామాజిక సమానత్వానికి ఆయనే పునాది వేశారని కొనియాడారు.ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాబుజీ, నాటి కాలంలో ఉన్న అస్పృశ్యత, వివక్ష వంటి సామాజిక రుగ్మతలను విద్యార్థి దశ నుంచే ధైర్యంగా ఎదుర్కొని జన చైతన్యం తెచ్చిన గొప్ప సంస్కర్త అని వారు గుర్తుచేశారు.అధికారంలోకి వచ్చి వ్యవస్థను మార్చాలని నమ్మిన ఆయన, ఐదు దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్ గా చట్టసభల్లో తన ముద్ర వేశారని ఆయన అన్నారు.దేశాభివృద్ధి అంటే కేవలం భవనాలు నిర్మించడం కాదు, సమాజంలోని చివరి వ్యక్తికి కూడా సమాన గౌరవం.అవకాశం లభించడమేనని నమ్మిన బాబుజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా యువత వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.సమాజంలో ఇంకా కొనసాగుతున్న అసమానతలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.ముఖ్యంగా యువత సామాజిక బాధ్యతను గుర్తించి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఎమ్మార్పీఎస్ యువత చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బడిపాటి ఓబులు, వెంకటేశ్వర్లు, బడిపాటి మరియదాస్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.