PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 4:55 pm Posted By : YEDUKONDALU DADALA

అన్యం శ్రీరాం పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి

 

సస్పెన్షన్ డిమాండ్‌తో దళిత నేతల హెచ్చరిక

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 16: ఎస్సీ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తిని వెంటనే అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దళిత నాయకులు ఘాటుగా డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.వివరాల ప్రకారం, వ్యాపార లావాదేవీల సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ కాజులూరుకు చెందిన ఇద్దరు మహిళలు జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తిని సంప్రదించగా, కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా అవమానించాడని ఆరోపించారు.సన్నపు లక్ష్మి (ఎస్సీ – మాల), ఆకుల నాగదేవి (ఓసీ) గొల్లపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.అయితే ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోవడంపై బాధితులు, దళిత నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం కోసం వెళ్లిన మహిళలను అవమానించడం దారుణమని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దళిత నాయకులు మాట్లాడుతూ, బాధిత మహిళలకు అండగా నిలవాల్సిన సమయంలో కొందరు రాజకీయ నాయకులు నిందితుడికి మద్దతు ఇవ్వడం అనైతికమని మండిపడ్డారు. కులదూషణ ఘటనలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.జిల్లా దళిత నాయకులు సిద్ధాంతుల కొండబాబు, మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్యం శ్రీరామచంద్ర మూర్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని, జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.మంత్రి వాసంశెట్టి సుభాష్ నైతిక బాధ్యత వహించి బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిద్దాంతుల కొండబాబు, మాత సుబ్బుబాయి,ఏనుగుపల్లి కృష్ణ, ప్రత్తిపాటి బుల్లిరాజు, పోల్నాటి సూర్యచంద్రరావు, మాజీ సర్పంచ్ పోతురాజు బాబూరావు, బుల్లెట్ రాజు, పులపకూర మహేష్, గుబ్బల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.