సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 29 :
చిలకలూరిపేట: ఆస్తి వ్యామోహం మనుషుల మధ్య బంధాలను తుంచేస్తోంది.కన్నవారు అనే మమకారం లేకుండా,ఆస్తి వాటా కోసం ఓ కుమార్తె ఏకంగా తను పుట్టి పెరిగిన ఇంటికే నిప్పు పెట్టిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే?
చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు,వారి వివాహిత కుమార్తెకు మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయి.ఆస్తిలో తన వాటా ఇవ్వాలంటూ సదరు కుమార్తె నిత్యం తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసేదని సమాచారం.మంగళవారం రాత్రి ఈ వివాదం కాస్తా ముదరడంతో, ఆమె విచక్షణ కోల్పోయింది. తల్లిదండ్రులు తన మాట వినడం లేదన్న కోపంతో, వారితో కలిసి ఉంటున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది.భయాందోళనలో కుటుంబ సభ్యులు క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ తృటిలో బయటకు పరుగులు తీశారు. అయితే,మంటల తీవ్రతకు ఇంట్లోని ఫర్నిచర్ మరియు ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
పోలీసుల రంగప్రవేశం..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.బాధితుల ఫిర్యాదు మేరకు నిందితురాలైన కుమార్తెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కన్నవారిని కనికరించకుండా,ఆస్తి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.