PEN POWER
Newspaper Banner
Date of Publish : 04 April 2026, 9:22 am Posted By : A YESOBU

ఎస్సీల భూముల ఆక్రమణపై విచారణ…

బాధితులకు న్యాయం చేస్తాం.ఎస్సీ కమిషన్ సభ్యుడు గౌతం రాజు

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 2

మండలంలోని కున్నంపల్లి గ్రామంలో ఎస్సీలకు కేటాయించిన భూముల ఆక్రమణపై ఎస్సీ కమిషన్ దృష్టి సారించింది.బాధితుల ఫిర్యాదుతో స్పందించిన కమిషన్ అధికారులు గురువారం పుల్లలచెరువు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు.కున్నంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 583లో ఎస్సీలకు చెందిన బుధాటి అంజమ్మ, ముండ్ల మరియబాబు భూములను అగ్రవర్ణాలకు చెందిన సుబ్బారెడ్డి, కృష్ణరెడ్డి, రామిరెడ్డి ఆక్రమించుకుని వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారు ఇటీవల విజయవాడలోని ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు.దీనిపై స్పందించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ ఆదేశాల మేరకు కమిషన్ సభ్యుడు డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్ పుల్లలచెరువుకు చేరుకుని సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.తహసీల్దార్ కార్యాలయంలో బాధితుల సమక్షంలో భూసంబంధిత రికార్డులను సవివరంగా పరిశీలించారు.అనంతరం కున్నంపల్లి గ్రామానికి వెళ్లి భూమిని ప్రత్యక్షంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గౌతమ్ రాజ్ మాట్లాడుతూ రికార్డు ప్రకారం ఎస్సీలకు కేటాయించిన భూములను వారికి అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమంగా ఆక్రమించి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.బాధితులకు ఎస్సీ కమిషన్ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. అధికారులను అప్రమత్తం చేస్తూ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.ఈ విచారణతో బాధితుల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.