PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 10:49 pm Posted By : M CHANTI BABU

ఒక్క ఫిర్యాదుతో 342 గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 24:రెండు నెలలుగా వంటగ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఉపశమనం లభించింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చేసిన ఫిర్యాదుతో అధికారులు స్పందించి 342 గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలంలోని వినియోగదారులకు గూడెం కాలనీలోని ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా హెచ్‌పీ గ్యాస్ సరఫరా జరుగుతోంది. ఇటీవల గ్యాస్ కొరత కారణంగా సరఫరా అంతరాయం ఏర్పడి సుమారు రెండు నెలలుగా సిలిండర్లు అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో జీకేవీధి ఎంపీటీసీ సభ్యురాలు రీమల రాజేశ్వరి ఈ నెల 17న మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీనిపై మండల రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సిలిండర్ల సరఫరా చేపట్టాలని ఆదేశించారు. ఫలితంగా శుక్రవారం గ్యాస్ కార్యాలయానికి 342 సిలిండర్లు చేరినట్లు తహసీల్దార్ అన్నాజీ రావు తెలిపారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుని సిలిండర్లను పొందాలని సూచించారు. సరఫరా అయిన సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు మళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.