PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 1:13 pm Posted By : YEDUKONDALU DADALA

కాకినాడ జిల్లా కలెక్టర్‌గా ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బాధ్యతలు

కాకినాడ స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్,ఏప్రిల్ 1: కాకినాడ జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.బుధవారం ఉదయం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో హరేంధిర ప్రసాద్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు విశాఖపట్నం నుండి అన్నవరం చేరుకుని శ్రీ రామ సత్యనారాయణ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకోగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డిఆర్ఓ డి. తిప్పేనాయక్, ఇతర జిల్లా అధికారులు వేదపండితుల పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

కలెక్టర్ ఛాంబరులో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరేంధిర ప్రసాద్, ఘన చరిత్ర కలిగిన కాకినాడ జిల్లాలో పనిచేయడం తనకు లభించిన అపూర్వ అవకాశమని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.విశాఖపట్నం జిల్లాలో కలెక్టర్‌గా, జివిఎంసి కమిషనర్‌గా పనిచేసిన అనుభవంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారుల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతో పనిచేస్తామని వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం పేదరిక నిర్మూలన, “స్వర్ణాంధ్ర-2047” లక్ష్య సాధనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ ప్రధాన జిల్లా అయిన కాకినాడలో రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా భౌగోళిక విశిష్టతలను వినియోగించుకుని ఆర్థిక ప్రగతికి కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డీసీ రమేష్ బాబు, ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఎన్. శ్రీధర్, సీపీఓ పి. త్రినాథ్, డ్వామా పీడీ పి. వెంకట లక్ష్మి, సమాచారశాఖ డీడీ పి. తిమ్మప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.