PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 3:16 pm Posted By : PEN POWER MEDIA

కొత్తగూడెం కేంద్రంగా డివిజన్ …

  • నాలుగు రాష్ట్రాలకు కూడలిగా కొత్తగూడెం స్టేషన్ ప్రాధాన్యం
  • బొగ్గు రవాణాతో రైల్వేకు భారీ ఆదాయం అందిస్తున్న కేంద్రం
  • డివిజన్ ఏర్పాటుతో సింగరేణి, పరిశ్రమలకు రవాణా బలోపేతం
  • భద్రాచలం అనుసంధానం, కొత్త రైళ్లకు వేగం పెరగనున్న అవకాశం
  • ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా డివిజన్

ఖమ్మం, పెన్ పవర్ ఏప్రిల్ 01: 

కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు రాకపోకలు సాగించే రైళ్లకు కూడలిగా మారినందున దాన్ని ప్రధానకేంద్రంగా మార్చాలన్నారు. కొత్తగూడెంకు బ్రిటిష్‌పాలన నుంచి చారిత్రక నేపథ్యం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఇక్కడి నుంచి బొగ్గు రవాణా జరిగేదని.. సింగరేణి కాలరీస్‌కు ఇప్పుడు ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారిందన్నారు.గూడ్స్‌ ట్రైన్ల రవాణా ద్వారా భారతీయ రైల్వేకు అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న ప్రాంతాల్లో కొత్తగూడెం ఒకటి అన్నారు. కొత్తగూడెం-కిరండోల్, మల్కన్‌గిరి-భద్రాచలం, కొత్తగూడెం-సత్తుపల్లి-కొవ్వూరు, జునాగఢ్‌-మల్కన్‌గిరి-భద్రాచలం లింకులతో ఈ స్టేషన్‌ నాలుగు రాష్ట్రాల ప్రధాన కూడలిగా మారిందని వెల్లడించారు. 2032 నాటికి వందేళ్లు పూర్తిచేసుకోబోతున్న ఈ స్టేషన్‌కు తగిన గుర్తింపు ఇవ్వాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారని గుర్తు చేశారు. శతవసంతాల గుర్తుగా కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని ఎంపీలు కేంద్రమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో వెల్లడించారు.కాగా, కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక ముఖచిత్రం గణనీయంగా మారుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉండటం వల్ల పరిపాలనాపరమైన నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని… కొత్తగూడెం కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటైతే ఈ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి లభించి, రైల్వే మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమవుతుందని చెబుతున్నారు. సింగరేణి కాలరీస్‌, కె.టి.పి.ఎస్, ఐటిసి వంటి భారీ పరిశ్రమలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని… బొగ్గు రవాణా ద్వారా రైల్వేకు వచ్చే భారీ ఆదాయం ఇక్కడి అభివృద్ధికి తిరిగి వినియోగించబడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.స్థానిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రారంభించేందుకు, రైళ్ల సమయాలను క్రమబద్ధీకరించేందుకు వీలవుతుంది. భద్రాచలం వంటి పుణ్యక్షేత్రానికి దేశవ్యాప్త అనుసంధానం పెరుగుతుందని అంటున్నారు. డివిజనల్ కార్యాలయం ఏర్పాటుతో వందలాది మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. స్థానిక వ్యాపారాలు పుంజుకుంటాయని చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల ఆధునీకరణ పనులు వేగంగా పూర్తవుతాయని.. కొత్తగూడెం రైల్వే డివిజన్‌ ఏర్పాటు కేవలం రవాణా సౌకర్యమే కాకుండా, వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్‌లా పనిచేస్తుందని అంటున్నారు.