వరికోత యంత్రాలకు డీజిల్
సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలి
-తహశీల్దార్ జి.ఆర్.ఠాగూర్ ఆదేశాలు
కాజులూరు, పెన్ పవర్, ఏప్రిల్ 26:
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలోని పెట్రోల్ బంకులను తహశాల్దార్ జి.ఆర్.ఠాగూర్ సందర్శించి ప్రస్తుత డీజిల్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల వరికోతల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో హార్వెస్టర్ యంత్రాలకు డీజిల్ కొరత ఏర్పడుతున్నట్లు రైతులు వ్యక్తం చేసిన ఆందోళనపై అధికారులు స్పందించారు.
ఈ సందర్భంగా బంక్ యజమానులతో తహశీల్దార్ ఠాగూర్ మాట్లాడారు. వరికోత యంత్రాలకు,అంబులెన్స్ సర్వీస్‌లకు డీజిల్‌ను అత్యవసర ప్రాధాన్యత కింద సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోత పనులు కొనసాగించేందుకు అవసరమైన డీజిల్ అందుబాటులో ఉంచాలని సూచించారు.అలాగే ఆక్వా రైతులకు సంబంధించి డీజిల్ విక్రయించాలని పేర్కొన్నారు.అలాగే, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించి రైతులకు నష్టం కలగకుండా చూడాలని బంక్ యజమానులను ఆదేశించారు.రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.తహశీల్దార్‌తోపాటు ఆర్‌ఐ వేగేశ్వరరావు,వీఆర్వో ఎస్.శ్రావణి,కట్టా సత్యనారాయణ తదితరులు ఉన్నారు.