PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 8:25 pm Posted By : YEDUKONDALU DADALA

ఘాటీ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి

కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 5:

కాకినాడ ఘాటీ సెంటర్ ప్రాంతాలలో ఉన్న బాబు జగజీవన్ రామ్, భారతరత్న అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాన్షీరామ్ విగ్రహాల వద్ద బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమాన్ని దళిత, గిరిజన, బీసీ, ముస్లిం, క్రైస్తవ ఐక్యవేదిక, ముగ్గుపేట – బాబుజి నగర్ పెద్దలు, యువత కమిటీ సభ్యులు సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాబు జగజీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులను నిర్వహించి దేశానికి సేవలందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు” అనే తీర్పుపై కొందరు రాజకీయ నాయకులు, మేధావులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మత మార్పిడి జరిగినా కులవ్యవస్థ ఇంకా కొనసాగుతోందని, క్రైస్తవ సమాజంలో కూడా మాల, మాదిగల కులాల పేర్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.రిజర్వేషన్లు అనేవి సామాజిక అసమానతలను తగ్గించేందుకు, శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటైనవని తెలిపారు. కాబట్టి వాటి అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోకుండా విమర్శించడం తగదని హెచ్చరించారు.సమాజంలో ఇప్పటికీ కులవివక్ష కొనసాగుతోందని, అంతర్జాతి వివాహాలపై పరువు హత్యలు, ఆలయ ప్రవేశంపై ఆంక్షలు వంటి సంఘటనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. సమానత్వం గురించి మాటల్లో కాకుండా ఆచరణలో చూపించాలని కోరారు.అంతేకాక, రిజర్వేషన్లు కోరే వారు ముందుగా సమాన జీవన విధానాన్ని అంగీకరించి, సామాజిక సమానత్వానికి కట్టుబడి ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ముగ్గుపేట, బాబుజి నగర్ పెద్దలు, ఐక్యవేదిక సభ్యులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, యువత పాల్గొన్నారు.