PEN POWER
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 7:27 pm Posted By : A YESOBU

చిన్నకండ్లేరు చెరువుకు గండి..!

రైతుల్లో ఆందోళన..!

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..?

తక్షణ మరమ్మతుల కోసం డిమాండ్

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 7

మండల కేంద్రంలోని చిన్నకండ్లేరు చెరువుకు మళ్లీ గండి పడడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గతంలో కూడా లీకేజీ కారణంగా చెరువులోని నీరు వృథా అయిన ఘటన మరువకముందే, మరోసారి అదే పరిస్థితి పునరావృతం కావడం రైతాంగాన్ని కలవరపెడుతోంది.ఎండాకాలం ప్రారంభమైన ఈ సమయంలో చెరువు నీరు వృథా కావడం వల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉందని రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.చెరువు కట్ట దిగువ భాగంలోని లెఫ్ట్ కెనాల్ నుంచి భారీగా నీరు బయటకు వెళ్లిపోతుండటంతో పరిస్థితి మరింత విషమిస్తోంది.చెరువు అంతర్భాగంలో గండి పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో చెరువును పరిశీలించిన వెలుగొండ ప్రాజెక్ట్ తీగలేరు (టీ-5) సాధన సమితి సభ్యులు, రైతు సంఘం నాయకులు జీవి గురునాథం, కె. జానకి రఘు, కొత్త చిన్న మాట్లాడుతూ మార్కాపురం జిల్లాలోని కంభం చెరువు తర్వాత రెండవ అతిపెద్ద చెరువు చిన్నకండ్లేరు అని తెలిపారు. ఇంత ముఖ్యమైన నీటి వనరును నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.గతంలో కూడా ఇలాగే లీకేజీ ఏర్పడినప్పుడు తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి సమస్యను మూలంగా పరిష్కరించలేదని వారు విమర్శించారు. ఈసారి మాత్రం తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను డిమాండ్ చేశారు. చెరువు కట్ట ఇరువైపులా ముల్లకంప చెట్లు, అడవి మొక్కలు విస్తరించి ఉన్నప్పటికీ వాటిని తొలగించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం చెరువు ఆయకట్టు కింద వరి, మిరప, మొక్కజొన్న తదితర పంటలు సాగులో ఉన్నాయని, నీరు ఇలాగే వృథా అయితే పంటలతో పాటు త్రాగునీటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే సమస్య ఎదురవుతున్నప్పటికీ చెరువు పునరుద్ధరణపై ఇచ్చే హామీలు ఆచరణలోకి రావడం లేదని విమర్శించారు.చిన్నకండ్లేరు చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే ఉమ్మడివరం, గారపెంట, చెన్నపాలెం, అక్కపాలెం, శతకోడు, తెల్లగట్ల తదితర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు అన్నారు.కాబట్టి చెరువు కట్టకు తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాల్సి వస్తుందని రైతు సంఘం నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్ట్ తీగలేరు సాధన సమితి సభ్యులు,తిప్పనబోయిన వెంకటేశ్వర్లు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.