PEN POWER
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 2:16 pm Posted By : Sathish Bede

జగన్మోహన్ రెడ్డి హత్యపై చింతూరులో నిరసన ర్యాలీ

వికోట రిపోర్టర్ హత్యపై ఆగ్రహం నిందితులపై కఠిన చర్యలు కోరుతూ జర్నలిస్టుల ర్యాలీ

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 29:

చిత్తూరు జిల్లా వికోట మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి హత్య ఘటనపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మాసినేని చంద్రశేఖర్ (చంటి), ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి పరిటాల వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చింతూరు డివిజన్ కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లారీ యూనియన్ కార్యాలయం నుండి చింతూరు పోలీస్ స్టేషన్ వరకు జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. అనంతరం చింతూరు ఐటీడీఏ పీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వికోట మండలానికి చెందిన జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డిని గంధం మాఫియా దారుణంగా హత్య చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కత్తులతో దాడి చేసి హత్య చేయడం అమానుషమని పేర్కొన్నారు. సమాజంలో నాలుగో స్తంభమైన జర్నలిస్టులపై ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరమని అన్నారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న జర్నలిస్టులను భయపెట్టేందుకు సంఘవిద్రోహ శక్తులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో చట్టపరంగా సమస్యలు ఉంటే న్యాయపరంగా ఎదుర్కోవాలని, కానీ హత్యలకు పాల్పడటం క్షమించరాని నేరమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఈ ఘటనను అత్యంత ప్రాముఖ్యంతో తీసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, ఈ హత్యపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వసంతాల శివకుమార్, మసకపల్లి సత్తిబాబు, బెజ్జంకి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు షాకత్, జీవన్ కుమార్, పిడియాల మోహన్, గంజి కృష్ణ, కమిటీ సభ్యులు భాస్కర చారి, సుధాకర్, వివిఎస్టీ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు విజయ్ కుమార్, బావి నాగేశ్వరావు, అలాగే పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.