PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 3:49 pm Posted By : D Ratnam

జల వనరుల సంరక్షణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు

 

“జలధార – జల హారతి” కార్యక్రమం అమలుకు చర్యలు వేగవంతం

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

గంగవరం /రంపచోడవరం పెన్ పవర్, ఏప్రిల్ 08:
పోలవరం జిల్లాలో జల వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు మరియు సమగ్ర నీటి వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చేపట్టిన “జలధార – జల హారతి” కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేసి, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, డీడబ్ల్యూఎంఏ, ఆర్‌డబ్ల్యూఎస్, హార్టికల్చర్, వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, అటవీ శాఖల అధికారులను సభ్యులుగా నియమించినట్లు వెల్లడించారు.మండల స్థాయిలో ఏఈఈలు, అసిస్టెంట్ ఇంజినీర్లు, ఫీల్డ్ అధికారులు సమన్వయంతో పనిచేసి జల వనరుల పరిరక్షణ చర్యలను చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో చెరువుల పూడికతీత, వాగుల శుభ్రత, రీచార్జ్ పిట్‌ల ఏర్పాటు, నీటి వృథా నివారణ వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ప్రతి మండలంలో కమిటీలు నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ ప్రణాళికాబద్ధంగా పనులు అమలు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ చర్యల ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచి రైతులకు స్థిరమైన సాగునీటి వనరులు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు సమిష్టిగా పాల్గొని జల సంరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.