PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 1:29 pm Posted By : PEN POWER MEDIA

తెలంగాణలో క్యాన్సర్ డేంజర్ బెల్స్

  • స్క్రీనింగ్ లోపమే క్యాన్సర్ ముప్పుకు ప్రధాన కారణం
  • మహిళల్లో రొమ్ము క్యాన్సర్ పరీక్షలు అత్యల్ప స్థాయిలో
  • పొగాకు వాడకంతో పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు అధికం
  • 2030 నాటికి తెలంగాణలో క్యాన్సర్ కేసులు మరింత పెరుగుదల
  • ప్రాథమిక దశలో గుర్తిస్తేనే ప్రాణాలు కాపాడే అవకాశం
  • కొత్తగా 46,762 క్యాన్సర్ కేసులు

హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01:

తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. క్యాన్సర్ బాధితుల సంఖ్య ప్రతి ఏడాది వేలల్లో పెరుగుతున్నా.. ముందస్తు పరీక్షల పట్ల ప్రజల్లో అవగాహన లోపించడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై తెలంగాణ క్యాన్సర్ బర్డెన్ ప్రొఫైల్-2026 పేరుతో ఐసీఎంఆర్ విడుదల చేసిన తాజా నివేదిక దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని నివేదికలో తెలిపారు. ప్రతి ఏటా వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయని.. అయినా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే స్క్రీనింగ్ పరీక్షల రేటు మాత్రం అత్యల్పంగా ఉందన్నారు. నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో 30-49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళల్లో కనీసం 4 శాతం మంది కూడా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం లేదు. ఇది వేలాది మంది ప్రాణాలను ముప్పులోకి నెడుతోంది.మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ రేటు కేవలం 0.3 శాతంగానే ఉందని నివేదిక వెల్లడించింది. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు 3.3 శాతం, నోటి క్యాన్సర్ పరీక్షలు 2.5 శాతం మంది మహిళలు మాత్రమే చేయించుకుంటున్నారు. పురుషుల్లో కేవలం 2.6 శాతం మంది మాత్రమే నోటి క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. నిమ్స్‌తో పాటు మరో 10 హాస్పిటల్స్ నుంచి సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 2026 చివరి నాటికి తెలంగాణలో కొత్తగా 46,762 క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. ఇందులో పురుషులు 21,252 మంది కాగా.. మహిళలు 25,510 మంది ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య ఏడాదికి 47,314కు చేరుతుందని అంచనా వేస్తున్నారు.ఇక గడిచిన దశాబ్ద కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య 30 శాతం పెరిగింది. 2015లో 40,177గా ఉన్న కేసులు, 2024 నాటికి 52,334 కు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మహిళల్లో ప్రతి లక్ష మంది జనాభాకు 183.8 మంది క్యాన్సర్ బారిన పడుతుండగా.. పురుషుల్లో ఈ రేటు 141.9గా ఉంది. రాష్ట్రంలో నమోదవుతున్న క్యాన్సర్లలో పొగాకు వాడకం వల్ల వచ్చే కేసులే ఎక్కువగా ఉన్నాయి. పురుషుల్లో 58.8 శాతం, మహిళల్లో 29.7 శాతం క్యాన్సర్లు పొగాకు వల్లే వస్తున్నాయి. ముఖ్యంగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి తోడు ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు కూడా క్యాన్సర్ ముప్పును పెంచుతున్నాయి. మహిళల్లో పీసీఓడీ, హార్మోన్ల సమస్యలు కూడా క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి.ముందస్తు పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే చాలా మంది రోగులు వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రులకు వస్తున్నారని MNJ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆలస్యం కావటం వల్ల చికిత్స క్లిష్టతరంగా మారుతోందన్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా స్క్రీనింగ్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని.. పొగాకు నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.