PEN POWER
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 10:44 am Posted By : SIVA KUMAR LANKA

పాకలపాడులో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డన్ అండ్ సర్చ్

పాకలపాడులో ఆపరేషన్ వజ్రప్రహార్ కార్డన్ అండ్ సర్చ్

తెల్లవారు జాము నుండి గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు

రికార్డులు లేని 40 బైకులు, కారు స్వాధీనం

స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచన మేరకు తనిఖీలు

నర్సీపట్నం, పెన్ పవర్ :

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని గొలుగొండ పోలీస్ స్టేషన్‌కు చెందిన పాకలపాడు గ్రామంలో శనివారం భారీ స్థాయిలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నర్సీపట్నం రూరల్, టౌన్, గొలుగొండ, మాకవరపాలెం, నాతవరం పోలీస్ స్టేషన్ల సిబ్బంది, ఈగల్ టీం, స్పెషల్ పార్టీ కలిసి సుమారు 70 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హాట్‌స్పాట్ ప్రాంతాలు, అద్దె ఇళ్లు, ఖాళీ భవనాలు, పాడుబడిన ఇళ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాలకు సంబంధించి అనుమానం ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 700 ఇళ్లు, 1000 మంది వ్యక్తులు, 270 వాహనాలు తనిఖీ చేయగా, సరైన పత్రాలు లేని 44 మోటార్ సైకిళ్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. పాత నార్కోటిక్ కేసుల్లో ఉన్న అనుమానితులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన నష్టాలపై అవగాహన కల్పించారు. యువత భవిష్యత్తును మాదకద్రవ్యాలు నాశనం చేస్తున్నాయని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా 100కు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమం చివర్లో పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఇలాంటి ప్రత్యేక చర్యలు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని డియస్పి తెలిపారు.