PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 10:56 am Posted By : SRIKANTH NARASIMHALA

ప్లాస్టిక్ నిషేధం అమలు ఎక్కడ?

చిలకలూరిపేటలో కొబ్బరి నీళ్ల దందా

నిబంధనలు గాలికి.. ధరలు ఆకాశానికి!

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 17 :  

చిలకలూరిపేట : భానుడి భగభగలకు తట్టుకోలేక ప్రజలు చల్లని కొబ్బరి నీళ్ల వైపు పరుగులు తీస్తుంటే, అదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు దోపిడీకి తెరలేపారు. అటు అధిక ధరలు, ఇటు నిషేధిత ప్లాస్టిక్ వినియోగంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నియంత్రణ లేని ధరలు.. జేబులకు చిల్లు

సాధారణంగా రూ. 30 నుండి రూ. 40 వరకు పలికే కొబ్బరి బోండాం ధర, ప్రస్తుతం చిలకలూరిపేటలో రూ. 50 నుండి రూ. 70 వరకు చేరింది. ప్రాంతాన్ని బట్టి, దుకాణాన్ని బట్టి ధరలు మారుతుండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం ధరల పట్టికలు కూడా ప్రదర్శించకపోవడం వ్యాపారుల ఇష్టారాజ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

లీటర్ బాటిల్ పేరిట ‘తక్కువ’ మాయాజాలం

కొబ్బరి నీళ్లను బాటిళ్లలో నింపి విక్రయించే క్రమంలో భారీ మోసం జరుగుతోంది. లీటర్ బాటిల్ అని చెప్పి రూ. 150 వసూలు చేస్తున్నప్పటికీ, ఆ బాటిళ్లలో నీటి పరిమాణం లీటర్ కంటే తక్కువగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. బాటిల్ సైజును చూపిస్తూ అధిక మొత్తాన్ని దండుకుంటున్న ఈ వ్యాపార శైలిపై సామాన్యులు మండిపడుతున్నారు.

నిర్వీర్యమైన ప్లాస్టిక్ నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగంపై కఠినమైన నిషేధం విధించినప్పటికీ, చిలకలూరిపేటలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కొబ్బరి నీళ్లను యధేచ్ఛగా ప్లాస్టిక్ బాటిళ్లలో పోసి విక్రయిస్తున్నా, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణపై సందేహాలు

మున్సిపల్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్లు సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు నిర్వహించి, ధరలను అదుపు చేయాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. కేవలం రికార్డుల్లో మాత్రమే తనిఖీలు జరుగుతున్నాయా? లేక వ్యాపారులతో కుమ్మక్కయ్యారా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

తక్షణ చర్యలు అవసరం

ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.