- డెడ్ స్టోరేజ్‌లో శ్రీశైలం.. విద్యుత్ ఉత్పత్తిపై మళ్లీ రెండు రాష్ట్రాల రగడ
- ధర్నాకు సిద్ధమైన తెలంగాణ నేతలు.. లాస్ట్ మినిట్‌లో ఏపీ యూటర్న్
- కల్వకుర్తి ఆయకట్టుకు నీటి ముప్పు.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన
- KRMB మౌనంపై తెలంగాణ ఫైర్.. బోర్డు పాత్రపై ప్రశ్నలు
- మళ్లీ పునరావృతమైతే డ్యామ్‌పైనే వంటవార్పు హెచ్చరిక
హైదరాబాద్, కర్నూలు, పెన్ పవర్ ఏప్రిల్ 1:
వాటర్ వార్. ఏపీ, తెలంగాణ మధ్య ఇది తెగని పంచాయితీ. ఒడవని లొల్లి. ప్రతీ ఏడాది ఒకటి రెండుసార్లు అయినా..నీళ్ల రగడ రచ్చ చేయడం కామన్. పైగా శ్రీశైలం డ్యామ్ నీళ్ల వివాదం మాత్రం నెక్స్ట్ లెవల్. రెండు రాష్ట్రాల బార్డర్‌లో ఉన్న శ్రీశైలం డ్యామ్ విషయంలో..ఏదో పేచీ ఉండనే ఉంటుంది. అయితే మీడియా ప్రకటనలు, లేఖలు రాసి నిరసనలు తెలుపుతూ వచ్చిన తెలంగాణ లీడర్లు ఈసారి ఓ అడుగు ముందుకేశారు. ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టు మీద ధర్నా చేసేందుకు రెడీ కాగా..ఏపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయడంతో వాటర్ వార్ కాస్త చల్లబడింది. శ్రీశైలం ప్రాజెక్టు వివాదాలకు కేరాఫ్‌గా ఎందుకు మారింది? ఇంత జరుగుతున్న KRMB ఎందుకు సైలెంట్‌గా ఉన్నట్లు?ఆంధ్రప్రదేశ్ పర్యాటకంరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల లొల్లి మరోసారి వివాదాన్ని రాజేసింది. కృష్ణా జలాల విషయంలో ఏపీ తీరుపై తెలంగాణ ఎమ్మెల్యేలు కన్నెర్ర చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ డెడ్ స్టోరేజ్ కు పడిపోయినా..ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేయడంపై తెలంగాణ లీడర్లు గుర్రుగా ఉన్నారు. ప్రతీసారి కేంద్రానికి, KRMBకి లేఖల ద్వారా ఫిర్యాదు చేసే తెలంగాణ..ఈ సారి కాస్త సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఏపీతో అమీతుమీ తేల్చుకునేందుకు ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు నేతలు. లాస్ట్ మినిట్‌లో ఏపీ సర్కార్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయడంతో..తెలంగాణ నేతలు ధర్నా ఆలోచనను విరమించుకున్నారు.కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య ఎప్పటినుంచో వివాదం నడుస్తూనే ఉంది. రాష్ట్ర విభజన నాటి నుంచి వాటర్ వార్ ఇంకో టర్న్ తీసుకుంది. రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు తాత్కాలిక కేటాయింపులు చేశారు. 811 టీఎంసీల నికర జలాలలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చేశారు. 2014లో తాత్కాలిక కేటాయింపులు చేసినా..ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 43 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రాజెక్టు మొత్తం 885 అడుగులు ఉంటే..ప్రస్తుతం 824 అడుగులకు నీటిమట్టం పడిపోయింది. ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్‌కు పడిపోయింది.డెడ్ స్టోరేజ్‌కు దగ్గరపడితే..సమ్మర్‌లో తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకోవాలని..ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారమే నడుచుకుంటున్నారు. జీవో కాని ఈ కండీషన్‌ను ఖతం పట్టించి..ఏపీ కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఎడమగట్టు నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసినా..ఏపీ మాత్రం కుడివైపు నుంచి కంటిన్యూ చేస్తోంది. ఇలాగే చేస్తే మునుముందు ఇబ్బందులు తప్పవని..ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం విద్యుత్‌శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఫోన్ చేసి చెప్పారు. కానీ ఏపీ అలాగే విద్యుత్ ఉత్పత్తి చేయడంతో.. ఉమ్మడి పాలమూరు నేతలు ఆందోళన బాట పట్టాలని డిసైడ్ అయ్యారు.శ్రీశైలం నుంచి ఏపీ అలాగే విద్యుత్ ఉత్పత్తి చేస్తే..కల్వకుర్తి ఆయకట్టుకు నీరు ఆగిపోయే ప్రమాదం ఉంది. యాసంగి పంట చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నీరు ఇవ్వకపోతే..రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం 15 రోజుల పాటు కల్వకుర్తి ఆయకట్టుకు నీరు అందించాలంటే.. ఏపీ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తరఫున చేసిన వినతికి ఏ మాత్రం స్పందించకపోవడంతో..ఏకంగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరే ఆందోళన చేయాలని డిసైడ్ అయ్యారు. ఏకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి, రాజేశ్ రెడ్డిలు శ్రీశైలం డ్యామ్ మీద ధర్నా చేయాలని నిర్ణయించారు. చివరి నిమిషంలో ఏపీ విద్యుత్ నిలిపేయడంతో ఆందోళనను విరమించుకున్నారు. ఈ పరిస్థితి మరోసారి పునరావృతం అయితే..డ్యామ్ పైన వంటవార్పు చేస్తామని హెచ్చరించారు.అయితే ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల వివాదం ధర్నాలకు వెళ్తున్నా.. వివాదాలను అదుపు చేయాల్సిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ కు పడిపోయినా..ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే KRMB చూస్తూ ఉండిపోయిందని తెలంగాణ నేతలు ఫైర్ అవుతున్నారు. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ విషయంలో కృష్ణా బోర్డు ఇకనైనా నిబంధనలు పాటించేలా గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. బోర్డు ఇలాగే మౌనంగా ఉంటే..తమదైన శైలిలో ఆందోళన బాటపడుతామంటూ పాలమూరు జిల్లా నేతలు గట్టి ఇండికేషన్ ఇచ్చారు. ఈ నీళ్ల లొల్లి ఎప్పుడు తెగుతుందో? కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు పంచాయితీని తెంపుతుందో లేదో చూడాలి మరి.