PEN POWER
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 6:57 pm Posted By : A YESOBU

మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి…

ఎంపీడీవో

పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్‌ 13

మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయంలో ‘నారీ శక్తీ వందన్’ సదస్సు సోమవారం పుల్లల చెరువు సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ సుబ్బమ్మ, ముటుకుల సెక్టర్ సూపర్వైజర్ దేవి బాయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మండలంలోని అంగన్వాడి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్లు మాట్లాడుతూ మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో భాగస్వామ్యం పెరగడం అత్యంత అవసరమని అన్నారు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో మరియదాస్ మాట్లాడుతూ మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందితేనే కుటుంబం, సమాజం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.ఆరోగ్యం, పోషణ, విద్య వంటి కీలక రంగాల్లో మహిళల పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగిందని వివరించారు. మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకుని సమాజంలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.సదస్సులో మహిళా శక్తి ప్రాధాన్యత, బాలికల విద్య, పోషణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.పరస్పర సహకారంతో ముందుకు సాగాలని మహిళలు సంకల్పం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ డి.ఈ., ఎ.ఈ., అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.