PEN POWER
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 10:22 pm Posted By : D Ratnam

మహిళల భద్రతపై పెద్ద గార్లపాడు లో అవగాహన సదస్సు

 

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవు

సీఐ నరసింహమూర్తి

గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 24 :
మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి అన్నారు. శుక్రవారం పెడగార్లపాడు గ్రామంలో గంగవరం ఎస్సై వెంకయ్య అధ్యక్షతన మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ నరసింహమూర్తి మాట్లాడుతూ మహిళల పట్ల గౌరవభావంతో ప్రవర్తించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై జరిగే వేధింపులు, అసభ్య ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని చెప్పారు. పోలీస్ శాఖ మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుని త్వరితగతిన స్పందిస్తామని తెలిపారు.గంగవరం ఎస్సై వెంకయ్య మాట్లాడుతూ గ్రామాల్లో మహిళల భద్రత కోసం పోలీస్ పహారా, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు. యువత మంచి మార్గంలో నడుచుకొని సమాజంలో సానుకూల వాతావరణం నెలకొల్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గంగవరం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.