PEN POWER
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 10:37 am Posted By : YEDUKONDALU DADALA

మాజీ మంత్రి చిక్కాల లేఖకు స్పందించిన సీఎం

గొల్లపాలెం–కుయ్యేరు రోడ్డు పనులు త్వరలో ప్రారంభం

కాజులూరు పెన్ పవర్ ఏప్రిల్ 21:
మండల ప్రధాన కేంద్రానికి కీలకంగా ఉన్న గొల్లపాలెం–కుయ్యేరు రహదారి పనులు రెండేళ్లుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు చేసిన వినతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఈ రహదారిపై ఆధారపడి ప్రయాణాలు సాగిస్తుండగా, పనులు నిలిచిపోవడం వల్ల రాకపోకలు కష్టసాధ్యంగా మారినట్లు స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను గమనించిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి పరిస్థితిని వివరించారు.ఈ లేఖపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి, సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.దీంతో గొల్లపాలెం–కుయ్యేరు రహదారి పనులు త్వరలోనే పునఃప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.మాజీ మంత్రి లేఖతో ప్రభుత్వం స్పందించడంతో కాజులూరు మండల నాయకులు,స్థానికులు,పలు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పనులు పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగై,గ్రామాల మధ్య అనుసంధానం సులభతరం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.