PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 11:00 pm Posted By : YEDUKONDALU DADALA

మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్‌పై దాడి ఘటన

మానవీయ కోణంలో స్పందనలు

న్యాయం కోసం బాధితుడి విజ్ఞప్తి

కాజులూరు, పెన్ పవర్ ఏప్రిల్‌ 8:

ఆర్యవటం గ్రామానికి చెందిన శీల మాజీ సర్పంచ్ పంపన శ్రీనివాస్‌పై జరిగిన దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గాయాలతో కోలుకుంటున్న శ్రీనివాస్‌ను బుధవారం జనసేన పార్టీ రామచంద్ర పురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బాధితుడి పరిస్థితి, కుటుంబ సభ్యుల ఆవేదన హృదయాలను కదిలిస్తోంది. “సమస్యలు ఎంత పెద్దవైనా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, హింసకు చోటు ఉండకూడదు” అని పోలిశెట్టి పేర్కొన్నారు. అయితే ఘటనపై పూర్తి వివరాలు తెలియలేదని, వాస్తవాలు బయటపడితే తప్పు చేసిన వారిని ఖండిస్తానని స్పష్టం చేశారు.
శ్రీనివాస్ మాత్రం తనపై జరిగిన దాడి గురించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఎటువంటి తప్పు చేయలేదు… నాకు న్యాయం కావాలి” అని మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. దాడి తర్వాత తనను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి తప్పు సమాచారం చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చారని, కానీ తాను నిజం మాత్రమే చెప్పానని వెల్లడించారు.
అంతేకాక, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన పరిణామాల్లో ప్రతిపక్ష నాయకుడు పిల్లి సూర్యప్రకాశ్ జోక్యం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని భావోద్వేగంగా తెలిపారు.ఇదిలా ఉంటే, ఉదయం నుంచి బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులు వరుసగా వచ్చి శ్రీనివాస్‌ను పరామర్శిస్తూ అండగా నిలుస్తున్నారు. “నీవు ఒంటరివి కాదు” అంటూ ధైర్యం చెబుతున్నారు. మరోవైపు, ఈ ఘటనను ఇంకా మర్చిపోలేక శ్రీనివాస్ భార్య, తండ్రి, కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారి కళ్లలో కనిపిస్తున్న భయం, ఆవేదన ఈ ఘటన తీవ్రతను ప్రతిబింబిస్తోంది.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు.