కాకినాడ, పెన్ పవర్,ఏప్రిల్ 28: కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు రాత్రి దొంగతనాల కేసుల్లో నిందితుడికి కోర్టు జైలుశిక్ష విధించింది. ఒక్కో కేసుకు ఒక సంవత్సరం చొప్పున మొత్తం మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ పిఠాపురం గౌరవ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం. విజయ రామేశ్వరి తీర్పు వెలువరించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2020 సంవత్సరంలో పిఠాపురం టౌన్ పరిధిలోని సీతయ్యగారితోట, మళయాలవారి వీధి, వేణుగోపాల స్వామి గుడి వీధి ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు చోరీ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బాధితుల ఫిర్యాదులపై పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడు ఎద్దు నరేంద్ర సాయి (20), అగ్రహారం, పిఠాపురం ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని, దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు.కేసు విచారణలో ప్రభుత్వ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చక్కా జగదీష్ కుమార్ బలమైన వాదనలు వినిపించగా, కోర్టు నిందితుడికి శిక్ష విధించింది.
కేసుల విజయవంతమైన దర్యాప్తు, ట్రయల్‌కు సహకరించిన పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాసు, టౌన్ ఎస్.ఐ వి. మణికుమార్, ఏపీపీ చక్కా జగదీష్ కుమార్, కోర్టు కానిస్టేబుల్ కె. వెంకటరమణలను జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, అభినందించారు.
ముద్దాయి వివరాలు:ఎద్దు నరేంద్ర సాయి (20), తండ్రి చంద్రశేఖర్, అగ్రహారం, పిఠాపురం.