చింతూరు , పెన్ పవర్, ఏప్రిల్ 19
చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ)లో అత్యల్ప బరువుతో పుట్టిన శిశువుకు విజయవంతంగా చికిత్స అందించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేయడం వైద్య రంగంలో మరో గొప్ప విజయంగా నిలిచింది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పొడియా మండలం పుట్టంపల్లి గ్రామానికి చెందిన మడకం కాంతి, మల్లా దంపతులకు పూర్వకాల ప్రసవం ద్వారా కుంట సీహెచ్‌సీలో శిశువు జన్మించింది. పుట్టిన వెంటనే శిశువు అత్యంత సంక్షోభ స్థితిలో ఉండటంతో చింతూరు సీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ బి. మహేష్ ఆధ్వర్యంలో, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.వి. కోటిరెడ్డి పర్యవేక్షణలో 80 రోజుల పాటు ప్రత్యేక వైద్య సంరక్షణ అందించారు. పుట్టినప్పుడు 1 కిలో కంటే తక్కువ బరువు ఉన్న శిశువు, చికిత్స అనంతరం 1.5 కిలోలకు పెరిగి ఆరోగ్యంగా మారింది. ఆసుపత్రి సిబ్బంది నిరంతరం శ్రద్ధతో సేవలు అందిస్తూ, అన్ని సంరక్షణ ప్రమాణాలను పాటించడం వల్ల శిశువు కోలుకోవడం సాధ్యమైంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందించడం ప్రజలకు పెద్ద ఊరటగా నిలిచింది. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకుని సురక్షితంగా డిశ్చార్జ్ చేయబడింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.వి. కోటిరెడ్డి, పీడియాట్రీషన్ డాక్టర్ బి. మహేష్, హెడ్ నర్స్ కుమారి, సిబ్బంది సుహాసిని, సౌందర్య, దుర్గా, స్వాతి, శిరీష పాల్గొన్నారు.