విద్యా సేవలపై అతిథుల ప్రశంసలు
పేద విద్యార్థులకు ఉచిత విద్య – డా. నాగేంద్ర హామీ
కాజులూరు, ఏప్రిల్ 27 పెన్ పవర్: కాజులూరు గ్రామంలోని శ్రీ కోటి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నూతన డైరెక్టర్ డా. డేగల నాగేంద్ర, కరెస్పాండెంట్ కాదా కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. 
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు తుమ్మల రామస్వామి (బాబు), మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ పాఠశాల కరెస్పాండెంట్ కాదా కోటేశ్వరరావు అందిస్తున్న విద్యాసేవలను కొనియాడారు. నూతన భాగస్వామి డా. డేగల నాగేంద్ర ఆధ్వర్యంలో విద్యను వ్యాపారంలా కాకుండా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం అభినందనీయమని పేర్కొన్నారు.
అక్కల రిశ్వంత్ రాయ్ మాట్లాడుతూ ఒక గ్రామంలో పది దేవాలయాల కంటే ఒక మంచి విద్యాలయం ఎంతో మేలని, ఇలాంటి విద్యాసంస్థలు గ్రామాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. పాఠశాలను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న నిర్వాహకులను అభినందించారు.
పాఠశాల నూతన డైరెక్టర్ డా. డేగల నాగేంద్ర మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు, అనాథలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ విద్యాసంస్థను నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీ ప్రపంచంలో మధ్యతరగతి, పేద కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడం కష్టమైపోయిందని, అలాంటి వారికి ఉత్తమ విద్య అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని పేర్కొంటూ, ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. అలాగే తన సంపాదనలో 20 శాతం “డేగల నాగేంద్ర ఫౌండేషన్” ద్వారా సేవా కార్యక్రమాలకు కేటాయిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అమజాల సత్యదుర్గ, టీడీపీ మండల అధ్యక్షులు చవ్వాకుల డాక్టర్ బాబు,మాజీ ఎంపీపీ యాళ్ళ కృష్ణారావు, సర్పంచ్ డేగల తిరుమల వేణి, మాజీ జడ్పీటీసీ యాళ్ళ సూర్యప్రకాశ్, జనసేన నాయకులు బొండా వెంకన్న, దడాల నాగార్జున, ఈశ్వర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ లు కొల్లు వెంకటేశ్వరరావు,బొండా వెంకట నరసింహ నాయుడు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.