PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 3:08 pm Posted By : PEN POWER MEDIA

సమ్మర్ కు ముందే పడిపోతున్న భూగర్భ జలాలు

  • మార్చిలోనే 8,500 ట్యాంకర్ల బుకింగ్స్.. ఏప్రిల్‌లో 10 వేల అంచనా
  • ఐటీ కారిడార్‌లో ఎండిపోతున్న బోర్లు.. ట్యాంకర్లపైనే ఆధారం
  • ప్రైవేట్ ట్యాంకర్ల దందా.. ఒక్కో ట్రిప్‌పై రూ.500 వరకు అదనపు భారం
  • 1,100 జలమండలి ట్యాంకర్లు సరిపోక నీటి కష్టాలు మరింత తీవ్రం
  • లోగో దుర్వినియోగంపై జలమండలి కఠిన హెచ్చరికలు

హైదరాబాద్, పెన్ పవర్ ఏప్రిల్ 01:

హైదరాబాద్‌లో భూగర్భ జలాలు తగ్గడంతో నీటి ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. మార్చిలోనే రోజువారీ ట్యాంకర్ల బుకింగ్స్ 8500 మార్కును చేరగా.. ఏప్రిల్ నాటికి ఇది 10 వేలకు చేరుతుందని జలమండలి అంచనా వేస్తోంది. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ఐటీ ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ధరలు పెరిగాయి. జలమండలి 1100 ట్యాంకర్లతో సరఫరాను ముమ్మరం చేసినప్పటికీ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నీటి ఎద్దడి మరింత పెరిగేలా కనిపిస్తోంది.సమ్మర్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి మెుదలవుతుంది. ఇది ప్రతి ఏడాది ఉండే తంతే. అయితే ఈసారి కాస్త ముందుగానే నగర ప్రజలకు నీటి కష్టాలు మెుదలయ్యాయి. నగరంలో వేసవి వేడి సెగలు మొదలవకముందే మంచినీళ్ల కష్టాలు ముదిరిపోయాయి. వాతావరణ మార్పులు, అడుగంటిపోతున్న భూగర్భ జలాల కారణంగా నగరవాసులు చుక్క నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నెల రోజుల్లోనే నీటి ట్యాంకర్ల డిమాండ్ అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరి చివరలో రోజుకు సగటున 5 వేల ట్యాంకర్ల కంటే తక్కువ డిమాండ్ ఉండగా.. మార్చి నెలాఖరు నాటికి ఆ సంఖ్య 8,500కు చేరుకుంది. ఏప్రిల్ నాటికి ఈ డిమాండ్ రోజుకు 10 వేల ట్యాంకర్లకు చేరుకోవచ్చని జలమండలి అంచనా వేస్తోంది.ముఖ్యంగా హైదరాబాద్ నగరం పశ్చిమ భాగంలోని ఐటీ కారిడార్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట వంటి ప్రాంతాలతో పాటు ఉప్పల్, మల్కాజిగిరి, అమీర్‌పేట ఏరియాల్లో 50 శాతానికి పైగా బోర్లు అడుగంటిపోయాయి. పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లు, విల్లాలు ఇప్పుడు పూర్తిగా ట్యాంకర్ల మీదే ఆధారపడుతున్నాయి. హాస్టళ్లు, వాణిజ్య సముదాయాల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో నిత్యం బోర్లపైనే
ఆధారపడే వీరంతా ఇప్పుడు నీటి కోసం అల్లాడుతున్నారు. జలమండలి నిబంధనల ప్రకారం 24 గంటలకు ఒకసారి మాత్రమే ట్యాంకర్ బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో.. ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ధరలను భారీగా పెంచేశారు. గతం కంటే ఒక్కో ట్యాంకర్‌పై రూ. 200 నుండి రూ. 500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దూరం, అవసరాన్ని బట్టి రేట్లను ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా జలమండలికి చెందిన 1,100 ట్యాంకర్లు 140 ఫిల్లింగ్ పాయింట్ల ద్వారా నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవడం సవాలుగా మారింది. ఏప్రిల్, మే నెలల్లో ఈ కష్టాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.కాగా, కొందరు ప్రైవేట్‌ ట్యాంకర్‌ యజమానులు అనధికారికంగా జలమండలి అధికారిక లోగోను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలా లోగో వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి హెచ్చరించారు. ఇటీవల కొందరు ప్రైవేట్‌ బోర్‌వెల్‌ ట్యాకర్ల ఆపరేటర్లు లోగో, బ్రాండ్‌ను వినియోగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇలా చేయటం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా మోసపూరిత చర్యగా గుర్తిస్తామన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా భావించి లోగో దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి ఎండీ హెచ్చరించారు.