PEN POWER
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 5:34 am Posted By : D Ratnam

పవిత్ర గోదావరి తీరంలో శ్రీ పళ్ళాలమ్మ జాతర శోభ –

గోడపత్రికతో ఉత్సవాలకు నాంది
కొత్తపేట, పెన్ పవర్, ఏప్రిల్26:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వెలసిన శ్రీ పల్లాలమ్మ అమ్మవారి తీర్థ కల్యాణ మహోత్సవాలు నెలరోజులపాటు జరగనున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తీర్థ మహోత్సవ గోడపత్రికను ఆదివారం ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మద్దింశెట్టి ఆదినారాయణ,ట్రస్ట్ బోర్డు సభ్యులు,ఆలయ కార్యనిర్వాహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి,గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మే 3న (ఆదివారం) చిన్న జాగారం,మే 4న(సోమవారం )పెద్ద జాగారం,మే 5న(మంగళవారం) సిరిబండి తీర్థ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ఉత్సవాలు ప్రారంభమైన తరువాత సుమారు నెలరోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు,వివిధ కార్యక్రమాలు ఘనంగా జరుగనున్నాయి.కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో వానపల్లి శ్రీ పల్లాలమ్మ అమ్మవారి ఆలయం ఒకటి.పవిత్ర గౌతమి గోదావరి నది ఒడ్డున విశిష్ట రూపంలో అమ్మవారు కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు.ఈ ప్రాంత భక్తులు అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ సిరిసంపదలు, సౌభాగ్యాలు,పంటల సమృద్ధి కోసం నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు.పంటల కాలంలో పంటలను కాపాడే గ్రామదేవతగా కూడా అమ్మవారిని విశ్వసిస్తారు.
ప్రతి ఏడాది జరిగే ఈ తీర్థ మహోత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.ఈ ఏడాది కూడా భక్తుల సందడిలో ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు.