PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 10:59 am Posted By : PEN POWER MEDIA

ఏడాదిలో 14 కోట్ల లడ్డూల విక్రయం

  • రికార్డు స్థాయిలో లడ్డూ విక్రయాలు
  • గత ఏడాది కంటే కోటిన్నర అదనం
  • రోజుకు 4 లక్షల లడ్డూల తయారీ
  • తిరుచానూరులో మే 1న స్వర్ణ రథోత్సవం
  • ఉత్సవాల వేళ పలు సేవల రద్దు
తిరుమల కొండపై లడ్డూ ప్రసాదం విక్రయాలు సరికొత్త చరిత్రను సృష్టించాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 14 కోట్ల లడ్డూలు అమ్ముడవ్వగా, టీటీడీకి రూ.567 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు, ఏప్రిల్ 30 నుండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు సర్వం సిద్ధమైంది.

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ , తిరుమల/తిరుచానూరు ఏప్రిల్ 16:

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి భక్తుల్లో ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. 2025-2026 వార్షిక సంవత్సరానికి సంబంధించి లడ్డూ విక్రయాలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. గత ఏడాది (2024-2025) 12.18 కోట్ల లడ్డూలు విక్రయించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13.95 కోట్లకు చేరింది. అంటే గతేడాదితో పోలిస్తే సుమారు 1.76 కోట్ల లడ్డూలు అదనంగా భక్తులు స్వీకరించారు. దీని ద్వారా టీటీడీకి రూ. 567 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలను తయారు చేస్తూ, భక్తులకు నిరంతరాయంగా అందిస్తున్నారు. మరోవైపు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 29న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు రూ.150 చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. మే 1వ తేదీన నిర్వహించే స్వర్ణ రథోత్సవం ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా నిలవనుంది. ఉత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 28న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ శుద్ధి కార్యక్రమం అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 28, అలాగే ఏప్రిల్ 30 నుండి మే 2 వరకు కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అధికారులు కోరారు.