PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 10:47 am Posted By : PEN POWER MEDIA

ఆటలో 20 కోట్లు…

‘ఆడుదాం ఆంధ్ర’లో రూ.20 కోట్లకుపైగా అక్రమాల ముసుగు వీడిందా?
రోజా–బైరెడ్డి పాత్రపై విజిలెన్స్ ఫోకస్
క్రీడా పరికరాలు, బ్రాండింగ్ ఖర్చుల్లో భారీ అవకతవకలు
క్రిమినల్ కేసులకు సిఫార్సు.. అరెస్టుల ఊహాగానాలు
ఏసీబీ లేదా సీఐడీకి కేసు బదిలీ దిశగా అడుగులు

‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల పేరుతో ప్రజా ధనాన్ని ఆటవికంగా వాడుకున్నారన్న ఆరోపణలకు విజిలెన్స్ నివేదిక బలం చేకూర్చడంతో, మాజీ మంత్రి ఆర్కే రోజా మరియు మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. క్రీడా పరికరాల కొనుగోలు నుంచి ప్రచార ఖర్చుల దాకా కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో, ఈ వ్యవహారం త్వరలో ఏసీబీ లేదా సీఐడీ దర్యాప్తుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 బ్యూరో రిపోర్ట్, పెన్ పవర్, తిరుపతి, ఏప్రిల్ 16:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక మరింత బలం చేకూర్చింది. క్రీడా పరికరాల కొనుగోలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్, సోషల్ మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియో కవరేజ్ వంటి విభాగాల్లో భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు దర్యాప్తు సంస్థ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. అప్పటి క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించి అనుభవం లేని వ్యక్తులకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, నాసిరకం క్రీడా సామగ్రిని అధిక ధరలకు కొనుగోలు చేయడం, ప్రచార ఖర్చుల పేరిట ఇన్ఫ్లుయెన్సర్లకు నిధులు మళ్లించడం వంటి అంశాలు విచారణలో బయటపడ్డాయని చెబుతున్నారు. మొత్తం రూ.20.37 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్రచారం పేరిట భారీగా ఖర్చులు చూపించడం, బ్రాండింగ్ మెటీరియల్, టీషర్ట్లు, క్యాప్స్, వీడియో–ఫోటో డాక్యుమెంటేషన్ వంటి సేవలకు మార్కెట్ విలువ కంటే ఎక్కువ చెల్లింపులు జరిపినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో పంపిణీ చేసిన క్రీడా పరికరాలు నాణ్యత లేకపోవడం, బిల్లులు మాత్రం అధికంగా ఉండటం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. ఈ వ్యవహారంలో రోజా, బైరెడ్డితో పాటు అప్పటి శాప్ ఐటీ కన్సల్టెంట్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ సిఫార్సు చేసినట్లు సమాచారం. కేసును ఏసీబీ లేదా సీఐడీకి అప్పగించి మరింత లోతుగా విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ స్థాయిలో త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే వైసీపీ హయాంలో జరిగిన పలు వ్యవహారాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో, ‘ఆడుదాం ఆంధ్ర’ కేసు కూడా రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో తదుపరి అడుగు అరెస్టుల దిశగా వెళ్తుందా లేదా అన్నది ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడి ఉండనుంది.