PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 12:03 pm Posted By : PEN POWER MEDIA

ఏపీ రాజకీయాల్లో కుల సమీకరణాల హీట్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం రోజురోజుకూ మరింత బలపడుతోంది. ఒకప్పుడు పార్టీ అంతర్గత లెక్కలకే పరిమితమైన కుల సమీకరణాలు ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తున్నాయి.ప్రతి వర్గం తమకు తగిన ప్రాతినిధ్యం, టికెట్లు, అధికారంలో వాటా కావాలని బలంగా డిమాండ్ చేస్తోంది.నియోజకవర్గాల పునర్విభజన అవకాశాలు ఈ ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి.రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు అతిపెద్ద సవాల్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

  • ప్రతి జిల్లాలో సామాజిక వర్గాల కొత్త డిమాండ్లు
  • పునర్విభజనతో పెరిగిన రాజకీయ ఆశలు
  • టికెట్లలో సమతుల్యతే పార్టీలకు అసలు పరీక్ష
  • స్థానిక నేతల నుంచి రాష్ట్ర స్థాయికి ఒత్తిడి
  • 2029 ఎన్నికల్లో కుల సమీకరణాలే కీలకం
  • అన్నీ పార్టీలపై పెరుగుతున్న ఒత్తిడి
  • టికెట్ల కేటాయింపే టఫ్ టాస్క్.. సామాజిక వర్గాల డిమాండ్లు జోరు
  • పునర్విభజన ముందు కుల రాజకీయం.. ఎవరికెంత ప్రాధాన్యం?

నెల్లూరు, పెన్ పవర్, ఏప్రిల్ 09:

రాష్ట్ర రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రాధాన్యం కొత్త దశలోకి ప్రవేశించింది. గతంలో టికెట్ల కేటాయింపు, పదవుల పంపకాల్లో కుల సమీకరణాలు పార్టీ స్థాయిలోనే చర్చించబడేవి. కానీ ఇప్పుడు ప్రజలు, సామాజిక వర్గాల నేతలు బహిరంగంగానే తమకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు. ఇది రాజకీయ వ్యవస్థలో స్పష్టమైన మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బోయ సమాజం, చిత్తూరు జిల్లాలో రెల్లి వర్గం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైశ్య వర్గం వంటి అనేక సామాజిక వర్గాలు తమకు తగిన రాజకీయ గుర్తింపు లేదనే భావనతో ముందుకు వస్తున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కాపు వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా తమ వాటా పెరగాలని కోరుతున్నాయి.ఇప్పటివరకు నియోజకవర్గాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ఈ అసంతృప్తి పెద్దగా బయటపడలేదు. అయితే త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనతో సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపించడంతో ప్రతి వర్గం తమకు ఎక్కువ ప్రాతినిధ్యం కావాలని బలంగా డిమాండ్ చేస్తోంది. మండల, పట్టణ స్థాయిలో ఉన్న స్థానిక నాయకత్వం ఈ డిమాండ్లను మరింత బలంగా ముందుకు తీసుకువస్తోంది.ఈ పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలకు టికెట్ల కేటాయింపు ఒక క్లిష్ట ప్రక్రియగా మారనుంది. సామాజిక సమతుల్యత పాటించడంలో చిన్న తప్పిదం జరిగినా అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. అందుకే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నిజంగానే “కత్తిమీద సాము”లా మారుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.