PEN POWER
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 12:33 pm Posted By : PEN POWER MEDIA

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై భారత్ వ్యూహాత్మక అడుగు

దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్న కేంద్రం, పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభించేందుకు ముందస్తు చట్టబద్ధ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తోంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపుతో పాటు పీఓకే కు కేటాయించిన ఖాళీ స్థానాలను భవిష్యత్ ఎన్నికల వ్యవస్థలో భాగం చేసే వ్యూహాత్మక అడుగుగా ఈ బిల్లు ప్రాధాన్యం సంతరించుకుంది.

పీఓకే విముక్తి తర్వాత ఈసీకి డీలిమిటేషన్ అధికారం
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్లు 90 నుంచి 114కు పెంపు
ఖాళీగా ఉన్న 24 పీఓకే సీట్లకు చట్టబద్ధ బలం
మహిళలు, వలసదారులకు నామినేటెడ్ సీట్ల పెంపు
భారత్ భౌగోళిక హక్కుకు చట్టపరమైన రూపం

న్యూస్ డెస్క్, పెన్ పవర్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 16:

దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు 2026లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే ) అంశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్ భూభాగం ఎప్పుడైతే భారత్ ఆధీనంలోకి వస్తుందో, ఆ ప్రాంతాల్లో ఎన్నికల నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అధికారాన్ని భారత ఎన్నికల కమిషన్‌కు అప్పగించేలా నిబంధనలు చేర్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన తక్షణ ఎన్నికల ప్రక్రియకు సంబంధించినది కాకపోయినా, భవిష్యత్‌లో ఆ ప్రాంతం భారత్ పరిపాలనలోకి వచ్చిన క్షణం నుంచే ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభించేందుకు ముందస్తు చట్టబద్ధ ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూడా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో పీఓకే కోసం 24 స్థానాలు ఖాళీగా రిజర్వ్ చేసి ఉంచారు. కొత్త బిల్లు ఈ వ్యవస్థకు మరింత చట్టబద్ధ బలం చేకూర్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ నిర్మాణంలో కూడా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 90 ప్రత్యక్ష ఎన్నికల స్థానాలు ఉన్న అసెంబ్లీని కనీసం 114 స్థానాలకు పెంచేలా కేంద్రం సవరణ బిల్లు తీసుకురానున్నట్లు సమాచారం. దీనితో ప్రాంతీయ సమీకరణాలు, మహిళా రిజర్వేషన్ అమలు, వలసదారులు మరియు శరణార్థులకు ప్రాతినిధ్యం వంటి అంశాల్లో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. నామినేటెడ్ సభ్యుల సంఖ్యను కూడా పెంచే ప్రతిపాదన ఉంది. మహిళలు, కశ్మీరీ వలసదారులు, పీఓకే శరణార్థులకు ప్రాతినిధ్యం కల్పించేలా నామినేటెడ్ ఎమ్మెల్యేల సంఖ్యను 5 నుంచి 7కు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఈ నామినేషన్లపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారం ఉండనుంది. రాజకీయంగా చూస్తే, ఈ బిల్లు కేవలం సీట్ల పునర్విభజనకే పరిమితం కాకుండా, పీఓకే భారత్‌లో అంతర్భాగమే అన్న దశాబ్దాల నాటి రాజ్యాంగ, పార్లమెంటరీ స్థావరానికి చట్టపరమైన మరింత బలం ఇవ్వడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. కేంద్రం దీన్ని భవిష్యత్ వ్యూహాత్మక అడుగుగా చూస్తోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.