PEN POWER
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 3:27 pm Posted By : PEN POWER MEDIA

ఇష్యూ బేస్డ్ ఉద్యమాలతో జగన్ కొత్త వ్యూహం

ప్రాంతాల వారీగా స్థానిక సమస్యలను సెంటిమెంట్‌గా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లే వ్యూహంతో వైసీపీ మళ్లీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసింది.ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అంశాలపై ఉద్యమాలతో ప్రాంతీయ భావోద్వేగాలను రాబోయే ఎన్నికల వరకు నిలబెట్టే దిశగా పార్టీ అడుగులు వేస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రాంతీయ సెంటిమెంట్‌తో వైసీపీ రీబిల్డ్ ప్లాన్
మూలపేట పోర్టు ఉద్యమంతో ఉత్తరాంధ్రపై ఫోకస్
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో రైతు భావోద్వేగాలపై పట్టు
జిల్లా నేతలను యాక్టివ్ చేస్తున్న జగన్ స్ట్రాటజీ
ప్రజా సమస్యలతోనే 2029 ఎన్నికల బాటలో వైసీపీ

స్టేట్ పొలిటికల్ బ్యూరో, పెన్ పవర్, అమరావతి, ఏప్రిల్ 14:

ఎన్నికల తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ చైతన్యవంతం చేయడానికి వైసీపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. ప్రాంతాల వారీగా అక్కడి ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిని ప్రజా ఉద్యమాలుగా మలచడం ద్వారా తిరిగి బలపడాలన్న లక్ష్యంతో పార్టీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యూహం ద్వారా స్థానిక నేతలు యాక్టివ్ కావడంతో పాటు, ప్రజల్లో కూడా పార్టీకి మళ్లీ కనెక్ట్ పెరుగుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు నిర్మాణం ఆలస్యం అంశాన్ని వైసీపీ ప్రధాన అజెండాగా తీసుకుంది. తమ హయాంలో పెద్దఎత్తున పనులు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి మందగించిందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ అంశాన్ని ప్రాంతీయ అభివృద్ధి–న్యాయం కోణంలో ప్రజల ముందు ఉంచుతూ, గత ఎన్నికల్లో కోల్పోయిన పట్టును తిరిగి సంపాదించాలనే వ్యూహంలో పార్టీ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇక రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంశాన్ని వైసీపీ బలమైన భావోద్వేగ అంశంగా మలుస్తోంది. ఇప్పటికే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్‌లు ఏర్పాటు చేసి, గ్రామ స్థాయిలో ప్రచారం, రైతు సమావేశాలు, యువజన–విద్యార్థి విభాగాలతో ఆందోళనలను కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.తెలంగాణ, కర్ణాటక ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు నీటి భద్రతకు ముప్పు ఉందన్న వాదనను ముందుకు తెచ్చి, ప్రస్తుత ప్రభుత్వం ప్రాంత ప్రయోజనాలను విస్మరిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారంతో రైతు సెంటిమెంట్‌ను పార్టీ వైపు తిప్పుకోవాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.మొత్తంగా చూస్తే, ఉత్తరాంధ్ర–రాయలసీమలో వేర్వేరు సమస్యలను ప్రాంతీయ సెంటిమెంట్‌గా మలిచి, వాటి ద్వారా పార్టీని మళ్లీ బలోపేతం చేయడం వైసీపీ ప్రస్తుత రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది ప్రజల్లో ఎంతవరకు స్పందన తెస్తుందో, స్థానిక నేతలు దీన్ని ఎంత సమర్థంగా తీసుకెళ్తారో రాబోయే నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.