PEN POWER
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 12:25 pm Posted By : PEN POWER MEDIA

అవినీతి ఆరోపణలతో మదనపల్లె తహసీల్దార్ అటాచ్

మదనపల్లె , పెన్ పవర్ ఏప్రిల్ 6:

మదనపల్లె లో పనిచేస్తున్న తహసీల్దార్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో జిల్లా పరిపాలన కీలక నిర్ణయం తీసుకుంది. తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్‌కు అటాచ్ చేస్తూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే తహసీల్దార్‌పై స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ ఫిర్యాదుపై పది రోజుల కిందటే జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా తహసీల్దార్ బ్యాంకు ఖాతాలోకి భారీ మొత్తంలో నగదు బదిలీలు జరిగినట్లు సమాచారం అందడంతో రాష్ట్ర సీసీఎల్ఏ, విజిలెన్స్ అధికారులకు వివరాలు చేరాయి. ప్రాథమిక విచారణ అనంతరం కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, తహసీల్దార్ వద్ద ఉన్న ప్రభుత్వ సిమ్ కార్డు మరియు రెండు డిజిటల్ కీలు వెంటనే ఉన్నతాధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.