PEN POWER
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 1:59 pm Posted By : PEN POWER MEDIA

పిఠాపురానికి మహర్దశ

పిఠాపురం మున్సిపాలిటీకి హోదా పెంపు
పవన్ కళ్యాణ్ చొరవతో కీలక నిర్ణయం
అదనపు నిధులకు మార్గం సుగమం
గ్రూప్-1 అధికారితో పరిపాలన బలోపేతం
రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పిఠాపురం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అభివృద్ధికి కొత్త దిశను తెరిచింది.
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కాకినాడ, ఏప్రిల్ 17:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గానికి శుభవార్త అందించింది. పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ కీలకంగా నిలిచినట్లు సమాచారం. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి అధికారులు సమర్పించిన ఆదాయం, వ్యయాల వివరాలను ప్రభుత్వం పరిశీలించింది. 2021 నుంచి 2025 వరకు ఆర్థిక పరిస్థితిని విశ్లేషించిన అనంతరం, మున్సిపాలిటీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ అప్‌గ్రేడ్‌తో పిఠాపురానికి అదనపు నిధులు వచ్చే అవకాశం ఉండగా, అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. చారిత్రాత్మకంగా 1957లో మున్సిపాలిటీ హోదా పొందిన పిఠాపురం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా నిలుస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో పాదగయ, కుక్కుటేశ్వర స్వామి, పురుహుతిక అమ్మవారి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రాకపోకలు పెరిగి, ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మున్సిపాలిటీకి సెలక్షన్ గ్రేడ్ హోదా రావడంతో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. త్వరలో గ్రూప్-1 స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమించే అవకాశముండగా, సిబ్బంది సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అధికంగా అందే అవకాశంతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. ఇదే సమయంలో పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు కూడా వేగం అందుకోనున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 37.25 కోట్లతో స్టేషన్‌ను ఆధునికీకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా పిఠాపురం అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు స్థానిక ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.